Skip to main content

సంక్షేమ సంక్షేమ హాస్టళ్లలోని బయోమెట్రిక్ మిషన్లలో సాంకేతిక సమస్యలు!

సాక్షి, హైదరాబాద్: సంక్షేమ శాఖలు నిర్వహి స్తున్న హాస్టళ్లలో బయోమెట్రిక్ హాజరు విధానం గందరగోళంగా మారింది.
విద్యార్థుల వేలి ముద్రలను బయోమెట్రిక్ మిషన్లు గుర్తించడం లేదు. పలు దఫాలుగా ప్రయత్నించినప్పటికీ హాజరు నమోదు కావడం లేదు. దీంతో హాస్టళ్లలో ఉన్నప్పటికీ విద్యార్థి గైర్హాజరీగా పరిగ ణిస్తూ అటెండెన్స్ రికార్డు కావడం వసతిగృహ సంక్షేమాధికారులకు ఇబ్బందులు తెచ్చిపెడు తోంది. వసతిగృహాల నిర్వహణలో పారదర్శకత చేపట్టే క్రమంలో ప్రభుత్వం బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు ఈ మేరకు మిషన్లు ఏర్పాటు చేసి హాజరును అమలు చేస్తున్నాయి. కానీ ఈ అమలులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. దీంతో వసతిగృహ సంక్షేమాధికారులకు బిల్లింగ్ సమయంలో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 1,675 సంక్షేమ వసతిగృహాలున్నాయి. వీటిని ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ-హాస్టళ్ల విధానాన్ని తెచ్చింది. ఇదే క్రమంలో వసతిగృహాల్లో విద్యార్థుల హాజరు విధానాన్ని బయోమెట్రిక్ పద్ధతిన అమలు చేస్తోంది. దీంతో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఆన్‌లైన్‌లోనే డైట్ బిల్లుల తయారీతో పాటు కాస్మొటిక్ చార్జీలకు బిల్లులు తయారవుతాయి. ఈ-హాస్టల్ విధానం సులభతరమైనప్పటికీ... విద్యార్థుల బయోమెట్రిక్ నమోదులో నెలకొన్న సమస్యతో బిల్లుల తయారీ ప్రహసనంగా మారింది. మాన్యువల్ బిల్లులు తీసుకునేది లేదని ఎస్సీ అభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. గిరిజన సంక్షేమ శాఖతో పాటు బీసీ సంక్షేమ శాఖలు దీన్నే అమలు చేస్తున్నాయి. బయో మెట్రిక్ హాజరు నమోదు కాకపోవడంతో వసతి గృహ నిర్వహణకు మాన్యువల్‌లో చేసిన మొత్తం ఆన్‌లైన్‌లో తయారు చేసే బిల్లుకు పొంతన ఉండటంలేదు. విద్యార్థుల వేలి ముద్రలు నమోదు కాకపోవడంతో ఆన్‌లైన్లో తక్కువ మంది విద్యార్థులున్నట్లు కనిపి స్తున్నాయి. బయోమెట్రిక్ హాజరు ఇచ్చిన విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం డైట్, కాస్మొటిక్ చార్జీలను విడుదల చేయడంతో వసతిగృహ సంక్షేమాధికారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ విధానం పూర్తిస్థాయిలో ఫలించే వరకు మాన్యువల్ పద్దతిని పరిగణించాలని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు కోరుతున్నారు.
Published date : 10 Jan 2020 04:40PM

Photo Stories