సమ్మేటివ్ పరీక్ష ఈ ఏడాదికి ఒక్కటే.. ఫార్మేటివ్ పరీక్షల్లోనూ మార్పులు!
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరం చాలా ఆలస్యంగా ప్రారంభం కావడం, ముఖాముఖి తరగతుల నిర్వహణ కూడా విద్యార్థులందరికీ ఇంకా పూర్తిస్థాయిలో అమలు కాని నేపథ్యంలో.. ఆ ప్రభావం ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలపై పడుతోంది.
గతంలో ఏటా మూడు సమ్మేటివ్‌లు, 4 ఫార్మేటివ్‌లుండగా వాటిని ప్రభుత్వం కుదించింది. సమ్మేటివ్‌లను రెండుగా చేసింది. అయితే ఇప్పుడు కోవిడ్ వల్ల పాఠశాల విద్యా శాఖ సమ్మేటివ్‌ను ఒక్కదానికే పరిమితం చేసింది. విద్యార్థులకు ఫైనల్ పరీక్షలు మాత్రమే నిర్వహించనుంది. మరోవైపు ఫార్మేటివ్ పరీక్షలు నాలుగింటిని కూడా రెండుకు కుదించింది. ఈనెల 2 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించినా అన్ని తరగతులనూ నిర్వహించలేని పరిస్థితులుండటంతో వాటిలో కూడా సడలింపులు చేపట్టింది. విద్యార్థులు భౌతిక దూరం పాటించేందుకు వీలుగా 8, 9 తరగతులను రోజువిడిచి రోజు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే 6, 7 తరగతులను కూడా రోజువిడిచి రోజు పెట్టనున్నారు. ఇక ఎలిమెంటరీ తరగతుల ప్రారంభంపై సంక్రాంతి తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. తల్లిదండ్రుల సమ్మతి మేరకే విద్యార్థులను స్కూళ్లకు రప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు హాజరు నుంచి కూడా మినహాయింపు ఇవ్వనున్నారు. విద్యార్థులందరికీ ఫార్మేటివ్ పరీక్షల నిర్వహణ ఇబ్బందిగా మారడంతో వాటి నుంచి కూడా సడలింపులకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రాజెక్టు ఆధారిత పరీక్షలను నవంబర్ చివరి వారంలో, ఫార్మేటివ్-1 డిసెంబర్ చివరి వారంలో, ఫార్మేటివ్-2 ఫిబ్రవరి చివరి వారంలో, సమ్మేటివ్ పరీక్షలను ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించనున్నారు. తరగతి గదిలో బోధించే అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని సమ్మేటివ్ పరీక్షలు పెడతారు. పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నలను కూడా తరగతుల్లో బోధించిన అంశాలను ఆధారంగా చేసుకొనే ఇవ్వనున్నారు.
Published date : 25 Nov 2020 03:45PM