Skip to main content

శివకాశిలో అక్షర వెలుగు నింపుతున్న ఈ టీచర్‌

స్వాతంత్య్రం ఎలా ఉండాలి? ఇంటి పక్క బడిలా ఉండాలి! దూరంగా ఉండకూడదు. భారంగా అనిపించకూడదు.
పిల్లలు బడికి వెళ్లలేకపోతే.. బడే పిల్లల ఇంటికి వచ్చేయాలి. ఆడిస్తూ పాడిస్తూ నేర్పించాలి. జయామేరీ టీచర్‌ అలాంటి బడే ఒకటి పెట్టారు. బల్లలు, బ్లాక్‌ బోర్డు లేని బడి!

మదట్టుపత్తి గ్రామ పంచాయితీ ప్రాథమిక పాఠశాల టీచర్‌ జయామేరి. మదట్టుపత్తి తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లాలో ఉంది.. శివకాశికి పది కి.మీ. దూరంలో. అవును. ఆ శివకాశే! దీపావళి బాణాసంచా సామగ్రి తయారయ్యే శివకాశి. జయాటీచర్‌ ఉంటున్నది తయిల్‌పట్టి గ్రామంలో. తయిల్‌పట్టి కూడా శివకాశికి దగ్గరే. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత శివకాశిలోని బాణాసంచా యూనిట్‌లు తెరుచుకోవడంతో వాటిల్లో పనిచేసేవాళ్లు మరీ చిన్నపిల్లల్ని ఇంట్లోనే వదిలేసి, కాస్త పెద్దపిల్లల్ని తమతో తీసుకువెళ్లడం మొదలుపెట్టారు. అయితే, పెద్దపిల్లలైనా సరే ఫ్యాక్టరీకి తీసుకురావద్దని యూనిట్లు తొలిరోజే గట్టిగా చెప్పేయడంతో పిల్లలంతా ఇళ్లలోనే ఉంటున్నారు. ఇళ్లల్లో కాదు కదా ఉండవలసింది! బడిలో ఉండాలి. బడులు కూడా లేవు కనుక బడినే వాళ్ల దగ్గరికి తీసుకెళ్లారు జయాటీచర్‌!

జయాటీచర్‌ పని చేస్తున్న పదట్టుపత్తి పాఠశాల ఇంకా తెరచుకోలేదు. ఆ సమయాన్ని ఆమె శివకాశి కార్మికుల పిల్లలకు నాలుగు అక్షరాలు నేర్పించడానికి వినియోగిస్తున్నారు. అక్షరాలు నేర్పించడం ఒక్కటే కాదు. కథలు చెబుతారు. కవితలు చదివి వినిపిస్తారు. పురాణాలు, ఇతిహాసాల్లోని ఆసక్తికరమైన ఘట్టాలను అర్థం అయ్యేలా వివరిస్తారు. వాటిల్లో పిల్లలకు సందేహాలు వస్తే తీరుస్తారు. అందుకోసం ఆమె తను ఉంటున్న తయిల్‌పట్టిలోనే 'అరుగమై పల్లి' (ఇంటిపక్క బడి)ని ఏర్పాటు చేశారు. నల్లబల్ల, బెంచీలు ఇవేమీ ఉండవు. వాళ్లతోపాటే ఆరుబయట చెట్ల కింద జయా టీచర్‌ కూర్చుంటారు.

స్కూలు లైబ్రరీలోంచి తెచ్చుకున్న చిన్న పిల్లల పుస్తకాల్లోని అక్షర జ్ఞానాన్ని వారికి పంచుతుంటారు. ఇప్పటికైతే వారానికొకసారి ఆమె ప్రతి శుక్రవారం 'అరుగమై పల్లి'ని తెరుస్తున్నారు. స్కూళ్లు తెరిచాక వీళ్లలో ఆరేళ్లు దాటిన వారందరినీ ఎవరికి అనుకూలంగా ఉండే స్కూళ్లలో వారిని చేర్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అనుకూలం అంటే ఇంటికి దగ్గరగా స్కూలు ఉండటం. ప్రయత్నాలు అంటే తల్లిదండ్రులను ఒప్పించడం. స్వాతంత్య్రం వచ్చిన 73 ఏళ్ల తర్వాత కూడా అక్షర స్వాతంత్య్రం కోసం జరుగుతున్న స్వచ్ఛంద సంగ్రామంలోని యోధులలో జయామేరి కూడా ఒకరు. స్వాతంత్య్రం అంటే వెలుగు నుంచి చీకటిలోకి. కళ్లే కనిపించనంత వెలుగు నుంచి శివకాశి కార్మికుల పిల్లలకు విముక్తి కలిగించడం కోసం తనకై తానుగా వెళ్లి చదువు చెబుతున్నారు జయా టీచర్‌.
Published date : 19 Aug 2020 09:34PM

Photo Stories