సీబీఎస్‌ఈ 10, 12 పరీక్షల షెడ్యూల్ విడుదల:పరీక్షలు ఎప్పటినుంచంటే...
పరీక్షలను త్వరత్వరగా ముగించేందుకు 12వ తరగతికి రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరపనున్నారు. మే 4వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు ప్రతి రోజూ మొదటి షిఫ్ట్ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యా హ్నం 1.30 గంటల వరకు, సెకండ్ షిఫ్ట్ మ ధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటాయి. పరీక్ష ప్రారంభమయ్యే అరగంట ముందు నుంచి ఆన్సర్ షీట్లు విద్యార్థులకు అందిస్తారు.
సీబీఎస్‌ఈ10, 12 తరగతుల అప్‌డేట్‌డ్ సిలబస్, స్టడీ మెటీరియల్, బిట్ బ్యాంక్, కెరీర్ గెడైన్స్, ఎగ్జామ్ టైం టేబుల్.. ఇతర అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
కోవిడ్ నిబంధనల మేరకు షెడ్యూల్
10వ తరగతి పరీక్షలు మే 4వ తేదీన ప్రారంభమై జూన్ 7వ తేదీతో ముగుస్తాయి. ఈ పరీక్షలు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగనున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి పాఠశాలల్లో ప్రాక్టికల్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. కోవిడ్ భద్రతా నిబంధనల మేరకు పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించామని సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్ సన్యమ్ భరద్వాజ్ చెప్పారు. రెండో షిఫ్టులో నాలుగు రోజులు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తారు. ఆ రోజుల్లో ఉదయం షిఫ్టులో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలుంటాయి. దీనివల్ల, పరీక్షాకేంద్రాల్లో విద్యార్థులు ప్రతి విడతలోనూ పరిమిత సంఖ్యలోనే ఉంటారు. ఉదయం షిఫ్టుల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు మధ్యాహ్నం షిఫ్టుల్లో పరీక్షల విధులను కేటాయించలేదన్నారు. గతేడాది సీబీఎస్ పరీక్షలు 45 రోజులపాటు జరగ్గా ఈసారి 39 రోజులకు కుదించామన్నారు. కోవిడ్-19 ప్రోటోకాల్స్‌ను తు.చ. తప్పకుండా పాటిస్తామన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్ వెంట తీసుకురావాలని సూచించారు. 10, 12వ తరగతులకు కలిపి ఈ ఏడాది 34 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు పేర్లు నమోదు చేసుకున్నారు. సాధారణంగా సీబీఎస్‌ఈ ప్రాక్టికల్స్ పరీక్షలు ఏటా జనవరిలోనూ, రాత పరీక్షలు ఫిబ్రవరిలో మొదలై మార్చిలో ముగుస్తాయి. కోవిడ్ దృష్ట్యా ఈ ఏడాది పరీక్షలు ఆలస్యంగా మొదలవుతున్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గత ఏడాది మార్చిలోనే పాఠశాలలను మూసి వేశారు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అక్టోబర్ 15వ తేదీ నుంచి పాక్షికంగా బడులను తెరిచారు.