Skip to main content

సెప్టెంబర్ 12 నుంచి పాలిసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా ప్రవేశాలకు సాంకేతిక విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ అధ్యక్షతన సోమవారం ప్రవేశాల కమిటీ సమావేశం జరిగింది. అనంతరం సమావేశం తీసుకున్న నిర్ణయం మేరకు ఆన్‌లైన్ ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 12 నుంచి ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నట్లు అందులో పేర్కొన్నారు. రెండు దశల్లో ప్రవేశాలు చేపట్టనున్నట్లు వివరించారు. గత ఏడాది కాలేజీల వారీ సీట్లు లభించిన ర్యాంకుల వివరాలను తమ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఈ నెల 11 నుంచి తమ వెబ్‌సైట్ (www.sbtet. telangana.gov.in, https://polycetts.nic.in )లో పొందవచ్చని వివరించారు. విద్యార్థులు పదోతరగతి మార్కుల మెమో, ఆధార్ కార్డు, నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, 2020 జనవరి 1న, ఆ తరువాత జారీ చేసిన ఆదాయ సర్టిఫికెట్ సిద్ధం చేసుకోవాలని, తెలంగాణలో తల్లిదండ్రులు నివాసం కలిగిన స్థానికేతర విద్యార్థులు వారి తల్లిదండ్రుల 10 ఏళ్ల నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 2న నిర్వహించిన పాలిసెట్-2020 పరీక్ష ఫలితాలు, ర్యాంకుల వివరాలు ఈ నెల 9న విడుదల చేసేందుకు సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) చర్యలు చేపట్టింది. ఒకవేళ 9న సాధ్యం కాకపోతే 10న ఫలితాలు విడుదల చేస్తామని ఎస్‌బీటీఈటీ కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ తెలిపారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో 30,760 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అందులో ప్రభుత్వ కాలేజీల్లో 11,980, ప్రైవేటు కాలేజీల్లో 18,780 సీట్లు ఉన్నట్లు వెల్లడించారు. వీటికి అదనంగా అగ్రికల్చర్ కోర్సుల్లో 870 సీట్లు ఉన్నాయని తెలిపారు.

మొదటి దశ షెడ్యూల్
  • 12-9-20 నుంచి 17-9-20 వరకు: ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్
  • 14-9-20 నుంచి18-9-20 వరకు: స్లాట్ బుకింగ్ వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
  • 14-9-20 నుంచి 20-9-20 వరకు:సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌చేయించుకున్న వారికి వెబ్ ఆప్షన్లు
  • 20-9-20: వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్
  • 22-9-2020: ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి సీట్లు కేటాయింపు
  • 22-9-20 నుంచి 26-9-20 వరకు: వెబ్‌సైట్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్.

రెండో దశ షెడ్యూల్..
  • 30-9-20 నుంచి 1-10-20 వరకు: వెబ్ ఆప్షన్లు
  • 3-10-20: ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి సీట్లు కేటాయింపు
  • 3-10-20 నుంచి 6-10-20 వరకు: వెబ్‌సైట్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్
  • 5-10-20 నుంచి 6-10-20: సీట్లు పొందిన కాలేజీల్లో రిపోర్టింగ్
  • 7-10-20: విద్యా సంవత్సరం ప్రారంభం
  • 7-10-20 నుంచి 14-10-20: ఓరియంటేషన్ కార్యక్రమం
  • 8-10-2020: వెబ్‌సైట్‌లో స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు
  • 15-10-20: తరగతుల ప్రారంభం
Published date : 08 Sep 2020 07:16PM

Photo Stories