రూ.1,860 కోట్లతో ‘ఆంధ్ర అభ్యసన పరివర్తన’: ఆదిమూలపు సురేష్
Sakshi Education
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి కోసం చేపడుతున్న ‘ఆంధ్ర అభ్యసన పరివర్తన’ (సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్–సాల్ట్) కార్యక్రమానికి అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకు (ఐబీఆర్డీ) నిధులు మంజూరు చేసిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇందులో భాగంగా రాష్ట్రానికి 250 మిలియన్ అమెరికన్ డాలర్ల (రూ.1,860 కోట్ల) ఆర్థిక సహాయం అందుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు ఐబీఆర్డీ కంట్రీ డైరెక్టర్–ఇండియా జునైద్ కమల్ అహ్మద్ నుంచి లేఖ అందిందన్నారు. మనబడి నాడు–నేడులో భాగంగా మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు విద్యారంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్యం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణకు పారిశుధ్య కారి్మకుల నియామకం, వారి శిక్షణకు ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలిపారు. నాడు–నేడు మొదటి దశ పనుల తీరు, పథకాల అమల్లో ప్రభుత్వ నిబద్ధతను గమనించి ఐబీఆర్డీ ఈ ఆర్థిక సాయాన్ని మంజూరు చేసిందన్నారు.
ఈ ప్రాజెక్ట్‌లో కీలక అంశాలు
ఈ ప్రాజెక్ట్‌లో కీలక అంశాలు
- పిల్లల్లో అభ్యాసాన్ని బలోపేతం చేయడం, ఉపాధ్యాయ–విద్యార్థుల పరస్పర సంబంధాల్లో నాణ్యతను మెరుగుపరచటం.
- నాణ్యమైన సేవలందించేందుకు సంస్థాగత సామర్థ్యాలను పెంచేలా సామాజిక సంస్థల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం.
- ఈ ప్రాజెక్ట్ 2021–22 నుంచి 2026–27 వరకు కాల పరిమితి కలిగి ఉంటుంది.
Published date : 24 Jun 2021 04:45PM