Skip to main content

రేప‌టి నుంచి తెలంగాణలో విద్యా సంస్థ‌ల బంద్‌.. విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

సాక్షి ఎడ్యుకేష‌న్‌: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు శాసనసభలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు.
‘‘దేశంలో మ‌ళ్లీ కరోనా వ్యాప్తి చెందుతోంది. మన పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలను ఇప్పటికే మూసివేశాయి. మ‌న రాష్ట్రంలోని విద్యాసంస్థల్లోనూ కొన్ని చోట్ల కరోనా కేసులు నమోదవుతున్నందు వ‌ల్ల మారే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యాసంస్థలను కొంత‌కాలం మూసివేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా అందుతున్నాయి. పరిస్థితులను పూర్తిగా సమీక్షించిన తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నింటినీ రేపటి నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మూసివేత ఆదేశాలు వైద్య కళాశాలలు మినహాయించి రాష్ర్టంలోని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ వర్తిస్తాయి. అలాగే గతంలో నిర్వహించిన మాదిరిగానే విద్యార్థుల‌కు ఆన్‌లైన్‌ శిక్షణా తరగతులు యథావిధిగా కొనసాగుతాయి’’ అని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
Published date : 23 Mar 2021 05:56PM

Photo Stories