Skip to main content

రాష్ట్రంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో...

సాక్షి, హైదరాబాద్: పోలీసుస్టేషన్లు, ఏసీపీ, డీసీపీ కార్యాలయాలతో పాటు పోలీసు కమిషనరేట్‌కూ నిత్యం పహారా అవసరం.
ఈ విధులు నిర్వర్తించే వారినే పోలీసు పరిభాషలో సెంట్రీలని అంటారు. ఇప్పటివరకు పురుష కానిస్టేబుళ్లే సెంట్రీలుగా ఉండేవారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా హైదరాబాద్ కమిషనరేట్ అధికారులు.. ఈ విధుల్లో మహిళల్నీ వినియోగించుకోవాలని నిర్ణయించారు. మొదట బషీర్‌బాగ్‌లోని కమిషనర్ కార్యాలయంలో ఉమెన్ సెంట్రీలను ఏర్పాటుచేశారు.

పోలీసు రిక్రూట్‌మెంట్స్‌లో...
గతంలో పోలీసు విభాగంలో మహిళా సిబ్బంది కొరత తీవ్రంగా ఉండేది. గడిచిన కొన్నేళ్లలో జరిగిన పోలీసు రిక్రూట్‌మెంట్స్‌లో మహిళలకు 33 శాతం కోటా ఇవ్వడంతో వీరి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది శిక్షణ పూర్తిచేసుకుని వచ్చిన కానిస్టేబుళ్లలో ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగానికి చెందిన మహిళలు పెద్దసంఖ్యలో ఉన్నారు. అయితే 24 గంటలూ విధుల్లో ఉండాల్సిన సెంట్రీ డ్యూటీలు వీరికి అప్పగించడంపై అధికారులు దృష్టిపెట్టలేదు.

ఈ టీమ్ లక్ష్యంఇదే...
ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలప్పుడు ఉన్నతాధికారులకు ప్రత్యేక విధులు, ఏరియాలు కేటాయించారు. ఇందులో భాగంగా ఓ మహిళా ఉన్నతాధికారిణికి ఏఆర్ మహిళా కానిస్టేబుళ్లతో స్పెషల్ పార్టీ కేటాయించారు. నిత్యం ఆమె వెంట ఉంటూ అవసరమైన సందర్భాల్లో కేటాయించిన విధులు నిర్వర్తించడమే ఈ టీమ్ లక్ష్యం. ఆ సమయంలోనే ఏఆర్ మహిళా సిబ్బంది ప్రతిభాపాటవాలపై సదరు అధికారిణికి స్పష్టత వచ్చింది. దీంతో ఆమె ‘ఉమెన్ సెంట్రీ’ఆలోచనకు రూపమిచ్చారు. ప్రాథమికంగా కమిషనరేట్‌కు 4+1 చొప్పున నలుగురు మహిళా ఏఆర్ కానిస్టేబుళ్లు, ఒక హెడ్-కానిస్టేబుల్‌ను కేటాయించారు.

భవిష్యత్తులో ఈ విధానాన్ని..
ఒక్కో మహిళా కానిస్టేబుల్ మూడు గంటల చొప్పున రొటేషన్ లో రోజుకు ఆరు గంటలు విధుల్లో ఉంటారు. వీరిని హెడ్-కానిస్టేబుల్ పర్యవేక్షిస్తారు. ఉమెన్ సెంట్రీల ఏర్పాటు మంచి ఆలోచనగా చెబుతున్న అధికారులు.. భవిష్యత్తులో ఈ విధానాన్ని ఇతర కార్యాలయాలు, పోలీసుస్టేషన్లకు విస్తరించాలని భావిస్తున్నారు.
Published date : 09 Jan 2021 06:38PM

Photo Stories