Skip to main content

ఫస్ట్, ఫైనల్ ఇయర్స్‌కే ప్రత్యక్ష బోధన.. వారి ప్రాక్టికల్ పరీక్షలు పూర్తి చేయడమే ప్రాధాన్యం ..

సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యార్థుల్లో మొదటి, ఫైనల్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే సోమవారం నుంచి ప్రత్యక్ష బోధన చేపట్టాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించింది.

2019-20లో చేరిన మొదటి ఏడాది విద్యార్థులకు, 2016-17లో చేరిన ఫైనల్ విద్యార్థుల కోసమే సోమవారం నుంచి మెడికల్ కాలేజీలను తెరుస్తున్నారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు రెండో ఏడాదికి వెళ్లాలంటే తప్పనిసరిగా ప్రాక్టికల్ పరీక్షలు పూర్తి చేయాలి. అలాగే ఫైనల్ ఇయర్ విద్యార్థులు తదుపరి హౌస్‌సర్జన్‌కు వెళ్లాలంటే వారికీ ప్రాక్టికల్స్ నిర్వహించాలి. కాబట్టి వీరికి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు మెడికల్ కాలేజీలను తెరుస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. అయితే వీరికి నిర్వహించే థియరీ క్లాసులను కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు.

ఫ్రెషర్స్’కు నెలపాటు ఆన్‌లైన్ ఓరియంటేషన్...
మెడికల్ అడ్మిషన్లు పొందిన కొత్త విద్యార్థులకు ఇప్పుడిప్పుడే నేరుగా తరగతులు నిర్వహించకూడదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. వారికి సోమవారం నుంచి నెలపాటు ఓరియంటేషన్ క్లాసులు, ఆ తర్వాత తరగతులు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. మార్చి వరకు ఇలాగే కొనసాగించి, ఆ సమయానికి కరోనా ఉధృతిని బట్టి సర్కారు నిర్ణయం తీసుకోనుంది. అలాగే రెండు, మూడు సంవత్సరపు విద్యార్థులకు కూడా అప్పటివరకు ఆన్‌లైన్ తరగతులనే కొనసాగించాలని నిర్ణయించింది.

నెగెటివ్’ రిపోర్ట్ చూపాలి...
మెడికల్ కాలేజీల పునఃప్రారంభం నేపథ్యంలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పలు సూచనలు జారీ చేసింది. కరోనాతో గతేడాది మార్చి నుంచి మెడికల్ కాలేజీలన్నీ మూతబడ్డాయి. అప్పటి నుంచి ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్న విషయం విదితమే. అకడమిక్ షెడ్యూల్ ప్రకారం అన్ని థియరీ క్లాసులు దాదాపు పూర్తయ్యాయి. కాలేజీకి వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయించుకొని, నెగెటివ్ రిపోర్టును తీసుకురావాలని పేర్కొంది. జలుబు, దగ్గు, శ్వాస సంబంధ లక్షణాలుంటే కాలేజీలోకి అనుమతించొద్దని తెలిపింది. తమ అనుమతితోనే పిల్లలను పంపిస్తున్నట్లు తల్లిదండ్రులు లిఖితపూర్వక లేఖ ఇవ్వాలి. కచ్చితంగా మాస్క్ ధరించాలి. ఆరోగ్యసేతు యాప్‌ను విద్యార్థులు తమ మొబైల్ ఫోన్లలో ఉపయోగించాలి. ప్రతి కాలేజీలో టాస్క్‌ఫోర్స్ లేదా ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ టీంను ఏర్పాటు చేసుకోవాలి. కరోనావ్యాప్తి తగ్గే వరకు దీన్ని కొనసాగించాలి. హాస్టల్ గదుల్లో ఒకరు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు ఒకేచోట గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలి. ఇంటి నుంచి వచ్చే సౌకర్యం ఉన్న విద్యార్థులను హాస్టల్‌లో ఉంచడానికి తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇవ్వొద్దని తెలిపింది.

మరికొన్ని మార్గదర్శకాలు

  • రెండు బ్యాచ్‌లుగా విద్యార్థులను విభజించాలి. వారిని రెండు షిఫ్టుల్లో హాజరయ్యేలా చూడాలి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక బ్యాచ్, మళ్లీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు మరో బ్యాచ్ ఉండేలా చూసుకోవాలి.
  • కాలేజీలోకి ప్రవేశించేనాటి నుంచి మూడు రోజుల ముందు ఐసీఎంఆర్ సర్టిఫై చేసిన లేబొరేటరీ నుంచి ఆర్‌టీపీసీఆర్ పరీక్ష రిపోర్టు తీసుకొని రావాలి.
  • విద్యార్థులు, ఫ్యాకల్టీలకు సంబంధించిన అందరి ఆరోగ్య వివరాల రికార్డును నిర్వహించాలి. దీర్ఘకాలిక జబ్బులు ఏమైనా ఉన్నాయా పరిశీలించాలి.
  • విద్యార్థుల్లో తలెత్తే ఒత్తిడి, ఆందోళన, భయాలను పారదోలేందుకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. అందుకోసం కౌన్సిలర్లను నియమించాలి.
  • స్టడీటూర్లు, ఇతర నిపుణులను కాలేజీకి ఆహ్వానిం చడం, క్షేత్రస్థాయిపని వంటి వాటిని నివారించాలి.
  • స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాల వంటి వాటిని నిర్వహించకూడదు.
  • తరగతి గదిలోకి కేవలం 50 శాతం విద్యార్థులను మాత్రమే అనుమతించాలి.
  • హాస్టళ్లలో శుభ్రమైన వేడి తాగునీటిని అనేకచోట్ల అందుబాటులో ఉంచాలి.
  • తక్షణమే లక్షణాలున్న వారిని గుర్తించడం కోసం విద్యార్థులతో కమిటీ ఏర్పాటు చేయాలి. తద్వారా తక్షణ వైద్యం అందించడానికి వీలు పడుతుంది.
Published date : 01 Feb 2021 05:08PM

Photo Stories