Skip to main content

ఫీజులు పెంచొద్దు..నిబంధనలు పాటించకపోతే గుర్తింపు రద్దు: విద్యాశాఖ

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలలు 2020-21 విద్యా సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో ఫీజులను పెంచడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ జీవో 46ను జారీ చేశారు. పాఠశాలల్లో ఫీజులను పెంచొద్దని, ఏ రకమైన ఫీజులను వసూలు చేయడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని, అదీ నెల వారీగా వసూలు చేసేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని స్టేట్ బోర్డు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఇతర అంతర్జాతీయ బోర్డుల సిలబస్‌తో కొనసాగుతున్న అన్ని పాఠశాలలు ఈ నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను అతిక్రమించినా, అమలు చేయకపోయినా ఆయా పాఠశాలలపై కఠిన చర్యలు చేపడతామని చెప్పారు. నిబంధనలు అతిక్రమించే రాష్ట్ర బోర్డు పాఠశాలలైతే గుర్తింపును రద్దు చేస్తామని, ఇతర బోర్డుల పాఠశాలలైతే రాష్ట ప్రభుత్వం ఇచ్చిన నిరభ్యంతర పత్రాలను (ఎన్‌వోసీ) రద్దు చేస్తామని వివరించారు. దీనికి సంబంధించి పాఠశాల విద్యా శాఖ వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.

వెనువెంటనే విద్యాశాఖ ఆదేశాలు..
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే విద్యాశాఖ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 10,759 ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఈ నిబంధనలను అమలు చేసేలా చూడాలని డీఈవోలను ఆదేశించింది. అమలు చేయని యాజమాన్యాలపై చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యా అదనపు డెరైక్టర్ రమణకుమార్ సూచించారు. ఫిర్యాదులను జిల్లా విద్యాశాఖాధికారులకు గానీ, టోల్ ఫ్రీ నంబర్‌కు (1800 425 7462) ఫోన్ చేసి చెప్పవచ్చన్నారు. కమిషనర్ కార్యాలయ మెయిల్‌కు (commr.edn.greviance@gmail.com) ఫిర్యాదు చేసినా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
Published date : 22 Apr 2020 04:23PM

Photo Stories