Skip to main content

ఫీజు కట్టలేదని అడ్మిషన్లు నిరాకరించొద్దు

సాక్షి, అమరావతి: వచ్చే విద్యాసంవత్సరం (2020-21)లో ప్రవేశాల కోసం వసూలు చేసే ట్యూషన్ ఫీజులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ (ఏపీఎస్‌ఈఎంఆర్‌సీ) ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు స్పష్టతనిస్తూ ఏప్రిల్ 23న ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్.కాంతారావు ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఏడాదిలో నిర్ణయించిన ఫీజులో క్వార్టర్ ఫీజు మాత్రమే కట్టించుకొని విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట సమయంలో ఆ ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని తల్లిదండ్రులు కోరితే ఆ క్వార్టర్ మొత్తాన్ని కూడా 45 రోజులు గడువుతో రెండు విడతల్లో కట్టించుకోవాలని స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు సూచించారు. క్వార్టర్ ఫీజు పూర్తిగా కట్టలేదంటూ ప్రవేశాలు నిరాకరించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. కమిషన్ వచ్చే విద్యా సంవత్సరానికి త్వరలోనే ఫీజుల నిర్ణయం చేస్తుందని, దాన్ని అనుసరించి ఫస్టు క్వార్టర్‌లో విద్యార్థి కట్టిన మొత్తాన్ని మినహాయించి మిగిలిన బకాయిని మాత్రమే యాజమాన్యాలు వసూలు చేసుకోవలసి ఉంటుందని చైర్మన్ జస్టిస్ కాంతారావు పేర్కొన్నారు.
Published date : 24 Apr 2020 04:12PM

Photo Stories