Skip to main content

ఫిబ్రవరి 19 నుంచి ఇన్నోవేషన్ యాత్ర

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల్లోనూ ఇన్నోవేషన్, స్టార్టప్‌లపై అవగాహన పెంపొందించేందుకు, వారిని కొత్త ఆవిష్కరణలవైపు నడిపించేందుకు వచ్చే నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ యాత్ర-2020ను టీ-ఐడియాథాన్ పేరుతో నిర్వహించనున్నట్లు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.
యూనివర్సిటీలు, కాలేజీల విద్యార్థుల కోసం ఈ యాత్ర చేపడుతున్నామని, 4 రోజులు, 4 బస్సుల్లో 4 వేల కిలోమీటర్లు ఈ యాత్ర ఉంటుందని వివరించారు. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యాత్ర పోస్టర్‌ను, ఉన్నత విద్యా మండలి డైరీని జయేశ్ రంజన్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ ఐఐటీ, ట్రిపుల్‌ఐటీ, బిట్స్ వంటి సంస్థల్లో ఏటా 13-14 శాతం మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో పాల్గొనడం లేదని, ఆరా తీస్తే వారిలో కొందరు ఉన్నత చదువులవైపు వెళ్తున్నారని, మిగతా వారు సొంత స్టార్టప్‌లతో సొంత కంపెనీలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాలకు, గ్రామీణ కాలేజీల్లోని విద్యార్థులకు కూడా అలాంటి ఆలోచనలు ఉంటాయని, వారిలో అవగాహన కల్పించి స్టార్టప్‌లవైపు నడిపించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా అన్ని యూనివర్సిటీల్లో ఇంక్యుబేటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని, ఇప్పటికే జేహబ్, ఉస్మానియా, ఫైన్‌ఆర్‌‌ట్స యూనివర్సిటీ, ఆర్‌జీయూకేటీలో ఏర్పాటు చేశామని, మిగతా వాటిల్లోనూ వచ్చే ఏప్రిల్ నాటికి ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటును పూర్తి చేస్తామన్నారు. ఐడియాతో వచ్చే వారికి దానిని ఎలా ఆచరణలో పెట్టాలి.. ప్రాడక్ట్ ఎలా డెవలప్ చేయాలి? మార్కెటింగ్ ఎలా చేయాలి? ఆర్థిక సహాయం ఎలా పొందాలి? పేటెంట్ ఎలా తీసుకోవాలన్న విషయాలను నేర్పిస్తామన్నారు. గతేడాది 220 మంది గ్రామీణ యువత ఆవిష్కరణలు చేశారని, వారికి మార్కెట్ నుంచి ఆర్డర్లు వస్తున్నాయన్నారు. ఇప్పుడు కాలేజీ విద్యార్థులను ఆ వైపు నడిపించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.

ఆవిష్కరణలతోనే దేశ ప్రగతి
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి మాట్లాడుతూ సాంకేతిక ప్రగతి, ఆవిష్కరణలు ఏ దేశంలో ఎక్కువగా ఉంటాయో ఆ దేశం అభివృద్ధిలో ముందుంటుందన్నారు. అందులో భాగంగా అన్ని కాలేజీలు, యూనివర్సిటీలను అనుసంధానం చేసేందుకు ఆవిష్కరణల యాత్ర చేపడుతున్నామన్నారు. కొత్త ఆవిష్కరణలతో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగేలా కేటీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఐడియాలు ఈ యాత్రతో ఆచరణలోకి వస్తాయన్నారు. ఇందులో అన్ని యూనివర్సిటీలు, కాలేజీలను భాగస్వామ్యం చేస్తామన్నారు. మరో వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ యాత్ర నిర్వహించే ప్రాంతాల వివరాలను వెల్లడించారు. విద్యార్థులు తమకున్న ఐడియాతో 90 నుంచి 100 సెకన్లలో వీడియో రూపొందించి పంపితే ప్రతి యూనివర్సిటీ నుంచి 10 ఐడియాలను ఎంపిక చేసి, ఒక్కో దానికి రూ.10 వేల చొప్పున ప్రోత్సాహకం అందజేస్తామని, తరువాత వాటి డెవలప్‌మెంట్‌కు సహకారం అందిస్తామన్నారు. విద్యార్థులు తమ ఐడియాలను 8074018372 నెంబరు వాట్సాప్‌కు పంపించాలని, మరిన్ని వివరాలను ఠీఠీఠీ. జీౌఠ్చ్టిజీౌడ్చ్టట్చ.ఛిౌఝ లో పొందవచ్చని అధికారులు తెలిపారు.

ఇవీ పాత జిల్లాల వారీగా యాత్ర వివరాలు
  • రూట్-1: వరంగల్-కరీంనగర్-సిద్దిపేట్-హైదరాబాద్
  • రూట్-2: ఖమ్మం-నల్లగొండ-రంగారెడ్డి-హైదరాబాద్
  • రూట్-3: ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ -హైదరాబాద్
  • రూట్-4: గద్వాల్-వనపర్తి-మహబూబ్‌నగర్-హైదరాబాద్
  • మొదటి రోజు ఆవిష్కరణల అవసరాలను వివరిస్తారు.
  • రెండోరోజు ఆవిష్కరణలను ఆచరణలోకి ఎలా తీసుకురావాలో తెలియజేస్తారు.
  • మూడో రోజు వాక్ ఫర్ ఇన్నోవేషన్ పేరుతో గ్రామీణ, పట్టణ విద్యార్థుల మధ్య అభ్యసన తేడాలను వివరించి అవగాహన కల్పిస్తారు.
  • నాలుగో రోజున హైదరాబాద్‌లోని టీహబ్‌లో ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఎక్స్‌పోజర్ టు ది హైదరాబాద్ ఎకో సిస్టమ్ పేరుతో దీనిని నిర్వహిస్తారు. ఇందులో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, అధికారులు పాల్గొంటారు.
Published date : 03 Jan 2020 03:31PM

Photo Stories