ప్రవేశాల్లో దివ్యాంగులకు సమాన అవకాశాలు అమలుచేయాలనే సుప్రీం ఆదేశాల మేరకు వర్సిటీలకు యూజీసీ ఉత్తర్వులు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యాసంస్థలోని వివిధ కోర్సుల ప్రవేశాల్లో దివ్యాంగులకు సమాన అవకాశాలు తప్పనిసరిగా అమలు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్ని యూనివర్సిటీలను ఆదేశించింది.
ప్రతి కోర్సులో విద్యార్థులకు ప్రవేశాల్లో రిజర్వేషన్ల కల్పనలో వికలాంగుల హక్కుల చట్టం 2016లోని సెక్షన్ 32లోని నిబంధనలకు అనుగుణంగా వారికి సీట్లను కేటాయించాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు యూజీసీ ఈ ఉత్తర్వులిచ్చింది. ఏటా ప్రతి కోర్సులో ప్రవేశించిన దివ్యాంగుల సంఖ్యను చీఫ్ కమిషనర్ లేదా స్టేట్ కమిషనర్‌కు సమర్పించాలని పేర్కొంది. ఈ రిజర్వేషన్లు అమలు చేయించాల్సిన బాధ్యత చీఫ్ కమిషనర్‌పై ఉంటుందని వివరించింది. తమ పరిధిలో విద్యాసంస్థలు ఈ సీట్ల కేటాయింపు బాధ్యతను నెరవేర్చాయో లేదో రాష్ట్ర కమిషనర్ పరిశీలించాలని పేర్కొంది. దివ్యాంగులకు సీట్లు కేటాయించని సంస్థలపై వికలాంగుల చట్టం 2016లోని సెక్షన్ 89 ఇతర నిబంధనల ప్రకారం తగిన చర్యలను చేపట్టాలని ఆదేశించింది. విద్యాసంస్థల భవనాల్లో దివ్యాంగులకు నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించింది. విభిన్న సామర్థ్యం ఉన్న వ్యక్తుల రోజువారీ అవసరాలను తీర్చడానికి, పథకాల అమలు కోసం ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొంది. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో సమానావకాశాల సెల్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. ఆ సెల్‌ల పనితీరును నిర్ధారించి నివేదికను యూజీసీకి నిర్ణీత ఫార్మాట్‌లో పంపాలని సూచించింది.
Published date : 17 Feb 2020 03:37PM