Skip to main content

ప్రతి గ్రామానికి అన్ లిమిటెడ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలి: సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని గ్రామాలకు అంతరాయం లేని అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం లక్ష్యంగా నెట్‌వర్క్ వ్యవస్థ ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

గ్రామంలో నెట్‌వర్క్ పాయింట్ నుంచి ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని, వినియోగదారులు ఏ సామర్థ్యం కనెక్షన్ కావాలన్నా ఇచ్చేలా ఉండాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు, అమ్మ ఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌ల పంపిణీపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ‘అమ్మ ఒడి’ చెల్లింపుల నాటికి కోరుకున్న వారికి ల్యాప్‌టాప్‌లు ఇచ్చేందుకు సిద్ధం కావాలన్నారు. ప్రతి గ్రామానికీ అన్ లిమిటెడ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇంటర్‌నెట్ కేబుల్స్ తెగిపోయి.. అవాంతరాలు వచ్చే పరిస్థితి ఉండకూడదని, అలాంటి సమస్యలను అధిగమించేలా ఆ వ్యవస్థను తీర్చిదిద్దాలని సూచించారు. ‘వైఎస్సార్ జగనన్న కాలనీల్లోకి కూడా ఇంటర్నెట్ నెట్‌వర్క్ తీసుకు రావాలి. ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలి. హెచ్‌టి లైన్ నుంచి సబ్‌స్టేషన్ వరకు, సబ్‌స్టేషన్ నుంచి పంచాయతీల వరకు అండర్ గ్రౌండ్ కేబుల్ తీసుకెళ్లే ఆలోచనతో ముందుకు సాగాలి. గ్రామ పంచాయతీ వరకు అన్ లిమిటెడ్ నెట్‌వర్క్‌ను తీసుకెళ్లాలి’ అని చెప్పారు.

ఇంకా ఏమన్నారంటే..

  • అమ్మఒడి, వసతి దీవెన లబ్ధిదారుల్లో 9 నుంచి 12వ తరగతి, ఆపై చదువుతున్న విద్యార్థుల్లో ఆప్షన్‌గా కోరుకున్న వారికి ల్యాప్‌టాప్ అందించడంపై దృష్టి సారించాలి. ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక విద్యలను అభ్యసిస్తున్న వారి అవసరాలు తీర్చేలా మరిన్ని స్పెసిఫికేషన్లతో కూడిన ల్యాప్‌టాప్‌లు ఇచ్చేలా ఆలోచించాలి.
  • ల్యాప్‌టాప్ చెడిపోతే.. దాన్ని వార్డు, గ్రామ సచివాలయాల్లో ఇస్తే, వారం రోజుల్లో మరమ్మతు చేసి ఇవ్వాలి. లేదా రీప్లేస్ చేయాలి. ఇందుకోసం కంపెనీ నిర్వహణను ఏడాది కాకుండా మూడేళ్లు పెట్టాలి.
  • పంచాయతీ నుంచి గ్రామంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి సరైన వ్యవస్థ ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలి. గ్రామాల్లో నెట్‌వర్క్ పాయింట్ వద్ద ఇంటర్నెట్ లైబ్రరీ ఏర్పాటు చేసే దిశగా ఆలోచించాలి. తద్వారా సొంత గ్రామాల్లోనే ఉంటూ ఇంటి నుంచే పని చేసే (వర్క్ ఫ్రం హోం)అవకాశం ఉంటుంది.
Published date : 23 Jan 2021 04:36PM

Photo Stories