పరీక్షలు లేకుండానే పాస్.. ప్రమోటయిoది ఎందరంటే..?
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా తెలంగాణలో పరీక్షలు రాయకుండానే 7,56,903 మంది పదోతరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు పాసయ్యారు.
మరోవైపు 60,75,106 మంది పైతరగతులకు ప్రమోట్ అయ్యారు. కరోనా వ్యాప్తి కారణంగా పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకుండా పోవడంతో డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేసి డిగ్రీ, పీజీ, ఇతర వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ఆయా విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. విద్యాశాఖ తేల్చిన ఈ లెక్కలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగస్టు 28న వెల్లడించారు. పదో తరగతి విద్యార్థులు 5,34,903 మందిని, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఫెయిలై అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సిన 1.47 లక్షల మందిని, ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌లో 75 వేల మందిని పరీక్షలు లేకుండానే ప్రభుత్వం పాస్ చేసింది. పాఠశాల విద్యలో 2 నుంచి 9వ తరగతి వరకు 53,26,588 మంది విద్యార్థులు ప్రమోటయ్యారు. మరోవైపు డిగ్రీ ఫస్టియర్ నుంచి సెకండియర్‌కు 2,54,263 మందిని, సెకండియర్ నుంచి థర్డ్ ఇయర్‌కు 2,34,653 మందిని ప్రమోట్ చేసింది. పీజీ ఫస్టియర్ నుంచి 89,591 మందిని సెకండియర్‌కు ప్రమోట్ చేసింది. ఇంజనీరింగ్‌లోనూ పరీక్షలు నిర్వహించకుండానే ఫస్టియర్ నుంచి సెకండియర్‌కు 52,088 మందిని, సెకండ్ నుంచి థర్డ్ ఇయర్‌కు 64, 610 మందిని, థర్డ్ ఇయర్ నుంచి నాలుగో సంవత్సరానికి 53,313 మందిని ప్రభుత్వం ప్రమోట్ చేసింది. వీరికి తరువాత పరీక్షలు నిర్వహించనుంది.
Published date : 29 Aug 2020 03:26PM