పరీక్షల్లో... మంచి మార్కులు తెచ్చుకోవాలి!
Sakshi Education
ప్రతి విద్యార్థి చదువుకోవడం కోసమే బడికి వెళతాడు.
కాబట్టి విద్యార్థుల దృష్టంతా చదువుపైనే ఉండాలి. చదువు ద్వారా జ్ఞానం పెంచుకోవాలి. అలా పెంచుకుంటేనే చదువులో మిగతా అందరికంటే ముందుండగలుగుతాం. మరి అందరికంటే ముందుండాలంటే ఏమిచేయాలి. అన్ని విషయాలను గుర్తుంచుకోగలగాలి. ఏ విషయాన్ని నేర్చుకోవాలంటే ఆ విషయంపైనే దృష్టి సారించాలి. అయితే మనపై పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. నాలుక ప్రమాదకరమైనది. చూసిందల్లా తిందామంటుంది. అలా చూసినదల్లా తినడానికి అలవాటుపడితే ఆరోగ్యం దెబ్బతింటుంది. అనారోగ్యానికి గురైతే చదవగలుగుతామా. చదవలేము కదా. అలాగే కళ్లు ప్రతి దానిని చూద్దామంటాయి. అలా ప్రతిదానిని చూస్తూ ఉంటే మనం చదువుపై దృష్టి పెట్టలేం. నాలుకకు రుచి ప్రమాదకరం. కంటికి ఆకర్షణ ప్రమాదకరం. వీటికి బానిసలైతే ఎవరైనా చెడిపోవడం అనివార్యం. ఇక అందరి మెదళ్లూ ఒకేలా ఉంటాయి. తెలివి కలిగినవాడికి ఒక రకం మెదడు, తెలివితక్కువవాడికి మరొక రకం మెదడు ఉండదు. అయితే దానిని ఎలా వినియోగించుకుంటామనే దానిపై మన జీవితం ఆధారపడి ఉంటుంది. మెదడులో నాడీకణాలు ఉంటాయి. వీటినే ఆంగ్లంలో న్యూరాన్స్ అని అంటారు. మెదడులో వీటి సంఖ్య 20 వేలకుపైమాటే. మనం ఏమిచూసినా, ఏమి విన్నా అది ఒక్కొక్క నాడీకణంలో నిక్షిప్తమవుతుంది. అయితే ఇన్ని వేల కణాల్లో అది ఎక్కడ నిక్షిప్తమైందనే విషయం మాత్రం ఎవరూ చెప్పలేరు. అయితే అదే విషయాన్ని తరచూ చదవడమో లేదా రాయడమో చేస్తూ ఉన్నట్టయితే అది మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అప్పుడే మనం పరీక్ష సరిగా రాయగలుగుతాం. మంచి మార్కులు తెచ్చుకోగలుగుతాం.
Published date : 27 Feb 2020 02:00PM