పరీక్షల్లేకుండా డిగ్రీలంటే కుదరదు: యూజీసీ
Sakshi Education
న్యూఢిల్లీ: పరీక్షలు లేకుండా విద్యార్థులను ప్రమోట్ చేసి డిగ్రీలు ప్రదానం చేయాలని రాష్ట్రాలు నిర్ణయం తీసుకోకూడదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పేర్కొంది.
పరీక్షలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించాలని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ భావిస్తే అప్పుడు పరీక్షలపై యూజీసీ నిబంధనలను పట్టించుకోకుండా ఉండవచ్చా? అలాగే రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సూచనలు పట్టించుకోకుండా యూజీసీ ఎలాగైనా పరీక్షలు జరిపించవచ్చా? అని జస్టిస్ అశోక్ భూషణ్ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. పరీక్షలపై తమ గైడ్‌లైన్స్ ను రాష్ట్ర అథారిటీలు ఉల్లంఘించలేవని సుప్రీంకోర్టుకు యూజీసీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు. పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల ప్రమాణాలు పతనం కావడం ఉండదని, ప్రతిష్టాత్మకమైన ఐఐటీలు కూడా పరీక్షలు లేకుండానే డిగ్రీలు ఇస్తామని ప్రకటించాయని రాష్ట్రాల తరఫు న్యాయవాదులు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది.
Published date : 19 Aug 2020 12:25PM