Skip to main content

ప్రధాని మోడి కోరిన కథ...ఈమెదే

''కథలు చెప్పండి... వినండి'' అన్నారు ప్రధాని మోడి. మొన్నటి ఆదివారం ఆయన తన 'మన్‌ కి బాత్‌'లో కథలు చెప్పే సంస్కృతి గురించి మాట్లాడారు.
పిల్లలకు కథలు చెప్పడం ఎంత అవసరమో తెలియచేశారు. అంతేకాదు చెన్నైలో గత నాలుగేళ్లుగా పిల్లలకు కథలు చెప్పడమే పనిగా పెట్టుకున్న శ్రీవిద్య వీరరాఘవన్‌ను మెచ్చుకున్నారు. ఆమె కూడా అందరిలాంటి తల్లే. కాకపోతే చాలామంది తల్లులు కథలు చెప్పట్లేదు. ఆమె చెబుతోంది. ఆమె పరిచయం.

''చిన్నప్పుడు అమ్మ కథ చెప్పనిదే ముద్ద ముట్టేదాన్ని కాదు'' అంటారు శ్రీవిద్య వీరరాఘవన్‌. మా అమ్మ నాకు అన్నం తినిపించడానికి ఎన్ని కథలు చెప్పేదో లెక్కలేదు. దాంతో నేను నాకు ఎనిమిది తొమ్మిదేళ్ల వయసు వచ్చేసరికి కథల భూతంలా మారిపోయాను. అంటే అల్లావుద్దీన్‌ దీపాన్ని రుద్దితే భూతం ప్రత్యక్షమైనట్టుగా నన్ను కాస్త అడిగితే కథ ప్రత్యేక్షమయ్యేది. నా చుట్టూ ఉండే వాళ్లకు ఆ వయసులోనే కథలు చెప్పేదాన్ని అంటారామె. శ్రీవిద్య వీరరాఘవన్‌ ఆదివారం హటాత్తుగా వార్తల్లోకి వచ్చారు. దానికి కారణం ప్రధాని నరేంద్ర మోడి తన రేడియో కార్యక్రమం 'మన్‌ కి బాత్‌'లో ఆమె ప్రస్తావన తేవడమే. ''పిల్లలకు కథలు చెప్పడం చాలా అవసరం. కాని మన దేశంలో కుటుంబాలు కొన్ని ఆ కథలు చెప్పే సంస్కృతికి దూరం అవుతున్నాయి. కథలు చెప్పే ఆనవాయితీని శ్రీవిద్య వీరరాఘవన్‌ లాంటి వాళ్లు కొనసాగిస్తున్నారు'' అన్నారాయన.

ఎవరు ఈ శ్రీవిద్య ?
కార్పొరేట్‌ ఆఫీస్‌లో తన హెచ్‌ఆర్‌ ఉద్యోగాన్ని ఆమె కొనసాగించి ఉంటే ఈ ప్రశ్న ఇవాళ ఎవరూ అడిగి ఉండేవారు కాదు. అందరిలో ఆమె ఒకరుగా మిగిలి ఉండేవారు. కాని అబ్దుల్‌ కలామ్, స్వామి వివేకానందలతో ప్రభావితమైన శ్రీవిద్య ''ఈ ఉద్యోగంలో పడి ఏం చేస్తున్నాను. నేనంటూ సమాజానికి ఏం చేయగలుగుతున్నాను?'' అని ప్రశ్నించుకున్నారు. అప్పటికే ఆమెకు ఒక కొడుకు. పిల్లల ప్రపంచం ఇప్పుడు ఎలా ఉందో ఆమె గమనించారు. ఉరుకులు పరుగుల జీవితంలో ఎవరూ వారికి కథలు చెప్పడం లేదని అనిపించింది. ''కథలే గొప్ప వ్యక్తిత్వాలను తయారు చేయగలవు. మెదళ్లను శక్తిమంతం చేయగలవు'' అంటారామె. చిన్నప్పుడు తాను విన్న కథలు ఎందుకు ఇప్పుడు అందరికీ చెప్పకూడదు అనిపించిందామెకు. అలా వచ్చిన ఆలోచనే 'స్టోరీ ట్రైన్‌'. పిల్లలు రైలు ప్రయాణంలో ఎన్నో కబుర్లు, కథలు చెప్పుకుంటారు. పిల్లలకు రైలంటే ఇష్టం. అందుకే స్టోరీ ట్రైన్‌ అనే సంస్థను ఏర్పాటు చేశాను అంటారామె. సంస్థ అంటే అదేదో పెద్ద సంస్థ కాదు. ఆమె ఒక్కతే ఆ సంస్థ. ఆ పేరుతో ఆమె చెన్నైలో పిల్లలకు కథలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారు.

నేర్చుకుని చెప్పొచ్చు..
కథలు చెప్పడం ఒక విద్య. మనం ఎన్ని కథలు విన్నా చెప్పడం రావాలి. నేను కూడా ఈ పని మొదలెట్టేటప్పుడు వరల్డ్‌ స్టోరీ టెల్లింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ స్థాపకుడైన డాక్టర్‌ ఎరిక్‌ టెల్లర్‌ వర్క్‌షాప్‌కు హాజరయ్యాను. పిల్లలకు కథలు చెప్పేటప్పుడు గొంతు, ముఖం, శరీర కదలికలు ఎలా ఉండాలి వారిని కథల్లోకి ఎలా ఆకర్షించాలి తెలుసుకున్నాను. ఎంత శిక్షణ ఉన్నా మనకూ కొంత టాలెంట్‌ ఉండాలి. ఆ మొత్తం అనుభవంతో నేను కథలు చెప్పడం మొదలెట్టాను. స్కూళ్లకు, కాలేజీలకు, పబ్లిక్‌ ప్లేసుల్లో, టీవీ ద్వారా ఎక్కడ ఎలా వీలైతే అలా పిల్లలకు కథలు చెప్పడం మొదలుపెట్టాను. ప్రొఫెషనల్‌ స్టోరీటెల్లర్‌గా మారాను.

తెనాలి రామ, అక్బర్‌ బీర్బల్, పురాణాలు.. ఒకటేమిటి అన్ని చెబుతాను. పిల్లలకు కథలు చెప్పడానికి మించిన ఆనందం లేదు. నా కొడుక్కు నేను కథలు చెబుతాను ఇంట్లో. కాని అందరి ఇళ్ళల్లో అమ్మలు ఈ పని చేయకపోవచ్చు. చేస్తే బాగుంటుంది. చేయలేకపోతే కనీసం కథలు చెప్పేవారి దగ్గరికైనా పంపాలి అంటారు శ్రీవిద్య. ఫోన్లలో మునిగి, గేముల్లో తేలే పిల్లల్ని తమ జోలికి రావడం లేదు కదా అని వదిలేస్తున్నారు తల్లిదండ్రులు. దాని వల్ల వారికి వికాసం, ఊహ, కల్పన, సాంస్కృతిక పరిచయం... ఇవన్నీ మిస్‌ అవుతున్నాయని తెలుసుకోవడం లేదు. ప్రధాని పిలుపు మేరకు తిరిగి ప్రతి ఇంటా కథలు చెప్పే వాతావరణం నెలకొనాలని ఆశిద్దాం.

పిల్లలకు ఎన్నో చెప్పొచ్చు..
నేను వివిధ సందర్భాలలో పిల్లలను కలిసినప్పుడు ఏదైనా కథ చెప్పమని వారిని అడుగుతాను. వారు కథకు బదులు జోకులు చెప్పడం ప్రారంభిస్తారు. ఈ కరోనా సమయంలో కుటుంబాలు తమలో తాము దగ్గరయ్యాయి. కాని కొన్ని కుటుంబాలు మన సాంస్కృతిక పరంపరను మిస్‌ అవుతున్నాయి. కథలు చెప్పడం మన సంస్కృతిలో ఒక భాగం. కథలు పిల్లలకు సంస్కారాన్ని నేర్పుతాయి. మన స్వాతంత్య్ర పోరాటం ఎంతో గొప్పది. ఒక వందేళ్ల పోరాటాన్ని పిల్లలకు శక్తిమంతమైన కథలుగా చెప్పాల్సిన అవసరం ఉంది.
– ప్రధాని నరేంద్ర మోడీ, 'మన్‌ కీ బాత్‌' రేడియో ప్రసంగంలో
Published date : 05 Oct 2020 05:53PM

Photo Stories