ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల చేరికల శాతం ఏటా తగ్గుతుంది..!!
మొత్తంగా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా.. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్యే అధికంగా ఉంటోంది. విద్యాశాఖ తేల్చిన తాజా లెక్కల ప్రకారం.. 2019-20లో ప్రభుత్వ స్కూళ్లలో పెరుగుదల నమోదైనా, ప్రైవేటు స్కూళ్లలో చేరిన విద్యార్థుల సంఖ్యే అధికంగా ఉంది. అలాగే విద్యార్థుల చేరికల శాతం కూడా ప్రైవేటు పాఠశాలల్లోనే అధికంగా ఉంటుండడంతో ప్రభుత్వ పాఠశాలల భవితవ్యంపై విద్యాశాఖ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఇంగ్లిష్ మీడియం లేకపోవడమే కారణమా?
రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు అన్నింటిలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంగ్లిష్ మీడియం లేకపోవడం తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలవైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణంగా కన్పిస్తోంది. 2018-19తో పోల్చుకుంటే 2019-20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు పెరగడం గమనార్హం. కొన్ని స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం ప్రారంభించడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. అయితే 2018-19 కంటే 2019-20లో విద్యార్థుల చేరికల శాతం మాత్రం తక్కువగానే నమోదైంది. ప్రభుత్వ స్కూళ్లలో బోధన సరిగా ఉండదన్న అభిప్రాయమూ ఇందుకు మరో కారణంగా కన్పిస్తోంది.
2016 నుంచి తగ్గుతున్న చేరికల శాతం
రాష్ట్రంలో 2016-17 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల నమోదు శాతం తగ్గుతుండం ఆందోళన కలిగిస్తోంది. 2016-17లో రాష్ట్రంలోని పాఠశాలల్లో 58.67 లక్షల మంది విద్యార్థులు ఉంటే అందులో ప్రభుత్వ స్కూళ్లలో 48.29 శాతం మంది, ప్రైవేటు పాఠశాలల్లో 51.71 శాతం మంది చేరారు. అలాగే 2017-18, 2018-19లో కూడా ప్రభుత్వ స్కూళ్లలో మొత్తం చేరికలు, చేరికల శాతం రెండూ ప్రైవేటు స్కూళ్ల కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. 2016 విద్యా సంవత్సరంతో పోల్చితే 2019-20లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 2.15 శాతం మేర తగ్గిపోయింది. అదే సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో 2.15 శాతం పెరుగుదల నమోదైంది.
ప్రభుత్వ పాఠశాలలు అధికంగా ఉన్నా..
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలే అధికంగా ఉన్నాయి. మొత్తంగా 40,900 పాఠశాలలు ఉంటే ప్రైవేటులో కేవలం 10,501 స్కూళ్లే ఉన్నాయి. మిగతావన్నీ (30,399) ప్రభుత్వ పాఠశాలలే. తక్కువ సంఖ్యలో ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో 2019-20లో 32.34 లక్షల మంది విద్యార్థులు ఉంటే భారీ సంఖ్యలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 27.72 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
రాష్ట్రంలో ఉన్న మొత్తం పాఠశాలలు: | 40,900 |
ప్రభుత్వ పాఠశాలలు: | 30,399 |
ప్రస్తుత విద్యార్థుల సంఖ్య: | 27.72 లక్షలు |
ప్రైవేటు పాఠశాలలు: | 10,501 |
ప్రస్తుత విద్యార్థుల సంఖ్య: | 32.34 లక్షలు |
ప్రీ ప్రైమరీ, ఇంగ్లిష్ మీడియం లేకపోవడమే ప్రధాన సమస్య
ప్రభుత్వ రంగంలో ప్రీప్రైమరీ, ఇంగ్లిషు మీడియం లేకపోవడమే ప్రధాన సమస్య. మూడేళ్లు నిండిన పిల్లలను తల్లిదండ్రులు బడిలో చేర్పించాలనుకుంటున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో 5 ఏళ్లు నిండితేనే చేర్చుకునే పరిస్థితి ఉంది. దీంతో తల్లిండ్రులు మూడేళ్లు నిండిన పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో జీరో ఎన్‌రోల్‌మెంట్ లేదా పది మందిలోపే విద్యార్థులు ఉంటున్నారు. ప్రభుత్వం ప్రీ ప్రైమరీ, ఇంగ్లిషు మీడియం ప్రారంభిస్తే వెంటనే 50 శాతం మార్పు వస్తుంది.
- పింగిలి శ్రీపాల్‌రెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు.