ప్రభుత్వ స్కూళ్లలో ఇంకా చేరుతూనే ఉన్నారు: విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, వినూత్న పథకాల వల్ల 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు అత్యధికంగా పెరిగాయని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ పేర్కొన్నారు.
అమ్మ ఒడి, మన బడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద తదితర పథకాలతో పాటు సంస్కరణల వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ల నుంచి తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది 6,06,285 మంది విద్యార్థులు అదనంగా చేరారని వివరించారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘2020–21లో విద్యార్థుల సంఖ్య అంచనాలకు మించి ఒక్కసారిగా పెరిగింది. దీంతో కొద్ది మందికి పాఠ్య పుస్తకాలు అందించాల్సి ఉంది. వీరి కోసం రూ.7 కోట్లతో అదనంగా పాఠ్యపుస్తకాల ముద్రణ చేయిస్తున్నాం. వారికి 15 రోజుల్లో పుస్తకాలను అందిస్తాం. 2020–21 విద్యా సంవత్సరం కోసం.. 2019 సెపె్టంబర్ 30 నాటికి యూడైస్‌లో ఉన్న విద్యార్థుల సంఖ్య (38,97,156)కు 5 శాతాన్ని పెంచి.. 40,92,014 మంది కోసమని ఏప్రిల్ నాటికి పుస్తకాలు ముద్రణ చేయించాం. మే నాటికి వాటిని జిల్లాల డిపోలకు తరలించాం. ఇలా చేయగలగడం ఇదే మొదటిసారి. 2020 సెప్టెంబర్ 3 నాటికి విద్యార్థుల సంఖ్య 40,84,983గా ఉంది. దీని ప్రకారం ఇంకా 7,031 మందికి సరిపడా పుస్తకాలు మిగిలి ఉన్నాయి. కానీ 2020–21 విద్యా సంవత్సరం కోసం జగనన్న అమ్మ ఒడి పథకానికి విద్యార్థుల వివరాలను అప్‌డేట్ చేసినప్పుడు ఆ సంఖ్య 43,89,952కి పెరిగింది. 2021 మార్చి 6 నాటికి అది కాస్తా.. 45,03,441కు పెరిగిపోయింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే అత్యధికంగా చేరారు. వీరిలో పుస్తకాలు ఇంకా అందని వారికి త్వరలో అందిస్తాం’ అని రాజశేఖర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల నియామకం కోసం టెట్, డీఎస్సీ నిర్వహణకు కసరత్తు చేస్తున్నామని రాజశేఖర్ చెప్పారు. టెట్‌ను ఈ ఏడాదిలోనే నిర్వహిస్తామన్నారు.
Published date : 08 Mar 2021 03:47PM