Skip to main content

పీఆర్సీ గడువు డిసెంబర్ 31 వరకు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదురుచూస్తున్న పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) గడువును ప్రభుత్వం పొడిగించింది.
డిసెంబర్ 31 వరకు పీఆర్సీ గడువు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఫిబ్రవరి 18 (మంగళవారం)నఉత్తర్వులు (447) జారీ చేశారు. ఆర్థిక శాఖ సమ్మతితో ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలోని 2.62 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యా యులు, 2.67 లక్షల మంది పెన్షనర్లు పీఆర్సీ అమలు కోసం వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉద్యోగుల వేతన సవరణే కాకుండా రాష్ట్ర కార్యాలయాలు, జిల్లా కార్యాలయాల్లో వర్క్‌లోడ్, ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు, అవసరమైన స్టాఫ్ ప్యాటర్న్, ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు రూల్స్ తదితర అంశాలను తేల్చే బాధ్యతలను ప్రభుత్వం పీఆర్సీకి అప్పగించిన సంగతి తెలిసిందే. వాటిని పూర్తి చేసేందుకు మరింతగా సమయం అవసరం కావడంతో గడువును పొడిగించాలని పీఆర్సీ గత నెల 28న ప్రభుత్వానికి లేఖ రాసింది. మరోవైపు ఈనెల 12న ఆర్థిక శాఖ కూడా అందుకు సమ్మతించడంతో పీఆర్సీ గడువును డిసెంబర్ 31 వరకు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి తోడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇప్పట్లో పీఆర్సీ అమలు చేయడం కష్ట సాధ్యం కానుంది. పైగా ఉద్యోగులు కోరుతున్నట్లుగా మధ్యంతర భృతి (ఐఆర్) 27 శాతం ఇచ్చినా ప్రభుత్వంపై ఆర్థిక భారం రూ.6,075 కోట్లు పడనుంది. ఈ పరిస్థితుల్లో పీఆర్సీ గడువు పెంపుైవ వైపే ప్రభుత్వం మొగ్గుచూపింది. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో పీఆర్సీ అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో పీఆర్సీ అమలు ఆలస్యం కానుందని సాక్షి ముందే (ఈనెల 14న) వెల్లడించింది.

నిరాశలో ఉద్యోగులు..
పీఆర్సీ గడువు పొడిగించడంతో ఉద్యోగులు నిరాశలో పడ్డారు. ఉద్యోగ సంఘాల నేతలపై మండిపడుతున్నారు. సోషల్‌మీడియా వేదికగా ఉద్యోగ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏమీ చేయలేకపోతున్నారంటూ విమర్శలకు దిగారు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నారు.
Published date : 19 Feb 2020 03:11PM

Photo Stories