Skip to main content

పదవీ విరమణ వయోపరిమితి పెంచడం వల్ల నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు

సాక్షి, హైదరాబాద్‌: కొత్తగా 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, త్వరలో నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు.
ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి పెంచడం వల్ల నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అలాగే.. కొత్త ఉద్యోగ నియామ కాలకు ఆటంకం కలగదన్నారు. గురువారం శాసనసభలో పెన్షన్‌ సవరణ బిల్లును, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు బిల్లును మంత్రి ప్రవేశపెట్టగా.. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మాజీ శాసనసభ్యుల పెన్షన్‌ను రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే.. అప్పర్‌ సీలింగ్‌ రూ.70 వేలుగా ఖరారు చేసినట్లు చెప్పారు. వైద్య చికిత్సల పరిమితిని రూ.లక్ష నుంచి రూ.10 లక్షలు పెంచుతున్నట్లు మంత్రి సభకు వివరించారు. ఈ పథకాన్ని మాజీ సభ్యులతో పాటు వారి సహ చరులు కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలో జారీ చేయనున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే భాగన్న వైద్య చికిత్స సమయంలో సీలింగ్‌ రూ.లక్ష మాత్రమే ఉండటంతో మరింత నగదు చెల్లించాల్సి వచ్చిందని, అప్పట్లో తలెత్తిన ఇబ్బం దులు పునరావృతం కాకూడదని సీఎం కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఉద్యోగుల పదవీ విరమణ 61కి పెంపు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇదివరకే నాల్గో తరగతి ఉద్యోగులకు అరవై ఏళ్లు, ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధన సిబ్బందికి 65 సంవత్సరాలు, న్యాయ సిబ్బందికి 60 ఏళ్లు పదవీ విరమణ వయోపరిమితి ఉందని గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో 60 ఏళ్ల వరకు ఉందన్నారు. ఉద్యోగుల సీనియార్టీని, అనుభవాన్ని వినియోగించు కునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వేతన సవరణ సంఘం కూడా ఈ మేరకు ప్రతిపాదించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం మానవుని సగటు జీవిత కాలం కూడా పెరిగిందని, దీంతో ఉద్యోగులకు మరో మూడేళ్ల పాటు పనిచేసే వెసులుబాటు ఇస్తున్నామని ఆయన వివరించారు.
Published date : 26 Mar 2021 03:30PM

Photo Stories