Skip to main content

పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు: కుదిరితే డిసెంబర్..లేదంటే జనవరిలోనే!

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల్లో ప్రత్యక్ష విద్యా బోధనపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది.
కరోనా ప్రభావం తగ్గి, పరిస్థితులు అనుకూలంగా ఉంటే వచ్చే నెలలో తరగతులను ప్రారంభించాలని భావిస్తోంది. వచ్చే నెలలో కూడా తరగతుల నిర్వహణ కుదరకపోతే జనవరిలో కచ్చితంగా ప్రారంభించాల్సి ఉంటుందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించాలంటే కనీసం 120 రోజులైనా ప్రత్యక్ష విద్యా బోధన అవసరమని అధికారులు భావిస్తున్నారు. అందుకు వచ్చే నెలలో స్కూళ్లను ప్రారంభించాలని, లేదంటే జనవరిలో కచ్చితంగా బోధనను ప్రారంభిస్తేనే పరీక్షల నిర్వహణ సాధ్యమవుతుందని చెబుతున్నారు. అయితే కరోనా ప్రభావం తగ్గకపోతే ప్రస్తుతం ప్రత్యామ్నాయ అకడమిక్ కేలండర్ ప్రకారం అమలు చేస్తున్న యాక్టివిటీ/ప్రాజెక్టు బేస్డ్ విద్యా బోధనను కొనసాగించాల్సి వస్తుందని, వాటి ఆధారంగానే పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుందని అధికారులు అంటున్నారు.

ఉన్నత స్థాయిలో చర్చించాకే నిర్ణయం..
గతేడాది నాలుగు ఫార్మేటివ్ అసెస్‌మెంట్, ఒక సమ్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్ష నిర్వహించినందున విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేశారని, ఇప్పుడు అది సాధ్యం కాదని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అందుకే యాక్టివిటీ/ప్రాజెక్టు బేస్డ్ విద్యా బోధనను కొనసాగిస్తున్నామని, చివరి అవకాశంగా వాటి ఆధారంగానైనా విద్యార్థులను పైతరగతులకు పంపించే అవకాశముంటుందని తెలిపారు. అయితే విద్యార్థులకు వార్షిక పరీక్షలు కచ్చితంగా ఉంటాయని, వచ్చే నెలలో కాకపోతే, జనవరిలో ప్రత్యక్ష విద్యా బోధన ఉంటుందని చెబుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటుందని, ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు చేపడతామని వెల్లడిస్తున్నారు. ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 23 లక్షల మంది, ప్రైవేటు పాఠశాలల్లో చదివే 31 లక్షల మంది విద్యార్థులు స్కూళ్లకు రావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వాటన్నింటినీ ఆలోచించాకే ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
Published date : 16 Nov 2020 03:40PM

Photo Stories