Skip to main content

పాఠశాలల్లో ‘పబ్లిక్ సేఫ్టీ క్లబ్బులు’

సాక్షి, హైదరాబాద్: నేటి బాలలే రేపటి పౌరులు.. వారికి నేడు కల్పించే అవగాహన జీవితాంతం గుర్తుండిపోతుంది.
అందుకే, అన్ని రకాల భద్రతలపై వారికి అవగాహన వచ్చేలా వినూత్న కార్యక్రమానికి తెలంగాణ పోలీసులు శ్రీకారం చుట్టారు. అందుకే, పాఠశాల విద్యార్థులకు ‘భద్రత’పై అవగాహన కల్పించడం, ప్రతీ పాఠశాలలో విద్యార్థులతో కొన్ని క్లబ్బులు నిర్వహించడం, భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారిచేతే వివరింపజేయడం, వారి నుంచి వచ్చే వినూత్న సలహాలు, సూచనలు తీసుకోవడం.. ఇదీ తెలంగాణ పోలీసుల సరికొత్త కార్యాచరణ. చికిత్స కంటే నివారణ మేలు అన్న నినాదంతో తెలంగాణ పోలీసులు ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. రోజుకోరకం కొత్త కేసులు వెలుగు చూస్తోన్న నేపథ్యంలో నేరాలు, భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న ప్రధాన లక్ష్యంతో ఈ విధానం అమలుకు సంకల్పించారు.

తమిళనాడే స్ఫూర్తిగా..
వాస్తవానికి ఇలాంటి విధానం అమలు ఇదే తొలిసారి కాదు. తమిళనాడు పోలీసులు దీన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ‘నేరాలు- భద్రత’పై వారు చేపట్టిన ప్రతీ అవగాహన కార్యక్రమం అక్కడ సత్ఫలితాలు ఇచ్చాయి. దీంతో తెలంగాణ పోలీసులు గతేడాదే దీనిపై అధ్యయనం చేశారు. అందులో పలు అంశాలకు డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులు కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. అనంతరం కొత్త సంవత్సరం నుంచి మన రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థినీ, విద్యార్థులతో కూడిన గ్రూపులను ఏర్పాటు చేస్తారు. వీరికి రోడ్డుభద్రత (డ్రంకెన్ డ్రైవ్, హెల్మెట్ వినియోగం, సీటుబెల్టు), మహిళా భద్రత, మానవ అక్రమరవాణా, చిన్నారుల భద్రత, వేధింపులు, డయల్ 100, షీటీమ్స్, హాక్ ఐ అంశాలలో వీరికి తొలుత శిక్షణ ఇస్తారు. తరువాత వీరు తోటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆయా అంశాలపై అవగాహన కల్పిస్తారు. వీరి నుంచి వచ్చే సృజనాత్మక ఆలోచనలనూ పోలీసులు స్వీకరించి ఇతరప్రాంతాల్లోనూ అమలుచేస్తారు. ఆపద ఎదురైతే.. ఎలా వ్యవహరించాలి? ఎవరిని సంప్రదించాలి? పోలీసులకు ఎలా సమాచారం ఇవ్వాలి? అన్నది ఈ ప్రచారం ప్రధాన లక్ష్యం.

ప్రతీ ఠాణాలోనూ విధుల విభజన..
ఈ అవగాహన కార్యాక్రమాలను విజయవంతంగా అమలు చేసేందుకు ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి దాకా విధుల విభజన జరిగింది. రోడ్డు భద్రత, మహిళా భద్రత, మానవ అక్రమరవాణా, చిన్నారుల భద్రత, డయల్ 100, షీటీమ్స్, హాక్-ఐ అంశాలలో అవగాహన కార్యక్రమాలు ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరుగుతాయి. ప్రతీ పోలీస్‌స్టేషన్‌లోనూ సర్కిల్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ దాకా అందరికీ ఒక్కోఅంశాన్ని అప్పగించారు. వారు తమ కు అప్పగించిన ప్రచార, అవగాహన కార్యక్రమాలను అమలు చేయాలి. వీటితోపాటు కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ‘ఈచ్‌వన్ -టీచ్‌వన్’కార్యక్రమం కూడా పోలీసులు స్వీకరించారు. వీరు స్థానిక యువత, స్వచ్ఛంద సంస్థ, మహిళాసంఘాల సాయంతో భద్రత, ఈచ్‌వన్-టీచ్‌వన్‌పై ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వీటి పురోగతిని ఠాణా పరిధిలో ఎప్పటికపుడు పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Published date : 07 Jan 2020 02:20PM

Photo Stories