పాఠశాలల ప్రారంభానికి విద్యాశాఖ సిద్ధమేనా?
విద్యాశాఖ, సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలల ప్రారంభానికి ఆయా శాఖలు సిద్ధంగా ఉన్నాయా? లేదా? అన్నది తెలుసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుత కరోనా పరిస్థితులు, పాఠశాలల ప్రారంభం వంటి అంశాలపై కూలంకషంగా చర్చించి ఓ నిర్ణయానికి రావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే వారంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. రాష్ట్రంలో 29 వేలకు పైగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలున్నాయి. వాటిల్లో 29 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. ఇక 10,900కు పైగా ప్రైవేటు పాఠశాలలుండగా, వాటిలో 31 లక్షల మందికి పైగా విద్యార్థులున్నారు. కరోనా కారణంగా గత మార్చిలో మూతపడిన పాఠశాలల్లో ఇంతవరకు ప్రత్యక్ష తరగతుల బోధన ప్రారంభం కాలేదు. మెజారిటీ ప్రైవేటు యాజమాన్యాలు పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నాయి. అయితే సర్కారీ పాఠశాలల్లో పరిస్థితి ఏంటనే దానిపై ఉన్నత స్థాయిలో చర్చించాకే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేటు యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకునేందుకే పాఠశాలల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
సమావేశంలో స్పష్టత..!
ఇటు ఈనెల 15వ తేదీ తర్వాత పాఠశాలల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అన్‌లాక్-5 మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితి, శాఖల సన్నద్ధతపై కూలంకషంగా చర్చించేందుకు విద్యాశాఖ సిద్ధ మైంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వచ్చే వారంలో ఆయా శాఖల అధికారులతో సమావేశమై చర్చించనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌తో చర్చించాక తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి పరిస్థితులను బట్టి ఈ నెలలో పాఠశాలలను ప్రారంభించడం కుదరకపోవచ్చన్న భావన విద్యాశాఖ వర్గాల్లో నెలకొంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ నెల 15 నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.