పాఠశాలల పని వేళల్లో మార్పులు: ఉదయం 9 నుంచి మధ్యాహ్నం..
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలన్నీ ఇక నుంచి ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ మేరకు విద్యాశాఖ పాఠశాలల పని వేళల్లో మార్పులు చేస్తూ గురువారం ఉత్తర్వులిచ్చింది. ఇప్పటి దాకా ఉదయం 9.30 నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో పాఠశాలల పనివేళలపై చర్చ జరిగింది. ఉదయం పూట త్వరగా తరగతులు నిర్వహించేలా సీఎం ఆదేశాలిచ్చారు. ఈ మేరకు పాఠశాల విద్య పరిశోధన, శిక్షణ మండలి అకడమిక్ క్యాలెండర్‌లో మార్పులు చేసింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు నిర్వహించే స్కూళ్ల పని వేళలను మార్పు చేసింది. దీనిపై విద్యాశాఖ డెరైక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదేశాలిచ్చారు. ఇక నుంచి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉండే ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయి. కోవిడ్ నిబంధనల మేరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Published date : 05 Feb 2021 05:30PM