పాఠశాల విద్య పూర్తయిన వారికి సర్టిఫికెట్ కోర్సులు: మంత్రి గౌతమ్‌రెడ్డి
Sakshi Education
సాక్షి, అమరావతి: పెట్టుబడుల ఆకర్షణ కోసం రాష్ట్ర పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మూడు రోజుల ఢిల్లీ పర్యటన సత్ఫలితాలిచ్చింది.
బీహెచ్‌ఈఎల్ సంస్థ ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీఓఈ) ఏర్పాటుతో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చినట్లు గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. సీఓఈ ఏర్పాటుకు ఒక కేంద్ర బృందాన్ని కూడా ఏర్పాటుచేయనున్నట్లు బీహెచ్‌ఈఎల్ సీఎండీ నళిన్ సింఘాల్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. పాఠశాల విద్య పూర్తిచేసుకున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం-బీహెచ్‌ఈఎల్ సంయుక్తంగా నైపుణ్యానికి సంబంధించిన సర్టిఫికెట్ కోర్సులు అందించడానికి బీహెచ్‌ఈఎల్ ముందుకు వచ్చిందని చెప్పారు. ఆయన మూడ్రోజుల ఢిల్లీ పర్యటన వివరాలను ‘సాక్షి’కి వివరించారు. ఆయనేమన్నారంటే..
సీఎం జగన్‌పై నీతి ఆయోగ్ ప్రశంసలు
- రాష్ట్రంలో పాలనపరంగా సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న కీలక సంస్కరణలను నీతి ఆయోగ్ మెచ్చుకుంది.
- కరోనా విపత్తు సమయంలో ఎంఎస్‌ఎంఈలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన ఏకై క రాష్ట్రం ఏపీ అని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ప్రత్యేకంగా ప్రశంసించారు.
- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగులలో కూడా ఏపీ మొదటి స్థానం కై వసం చేసుకోవడంపై అభినందనలు తెలిపారు.
- కరోనా కష్టకాలంలో ప్రభుత్వ పాలన బాగుందని అమితాబ్ కాంత్ అభినందించారు.
- ఈశాన్య భారత్ అభివృద్ధిలో ఏపీ పోర్టుల పాత్ర కీలకమని.. రాష్ట్రంలో భావనపాడు పోర్టును తీర్చిదిద్దేందుకు కేంద్రం సహకరిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
- అక్టోబర్ నుంచి ఎప్పుడైనా విశాఖలో డిజిటల్ కాన్‌క్లేవ్ నిర్వహించేందుకు నీతి ఆయోగ్ ముందుకొచ్చింది.
రక్షణ రంగ పెట్టుబడులపై గురి
- మరోవైపు.. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయ రక్షణ రంగంలో పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడంపై మంత్రి గౌతమ్‌రెడ్డి దృష్టి సారించారు. ఇందుకోసం వాయు, నేవీ చీఫ్ మార్షల్స్, డీఆర్‌డీవో చైర్మన్‌తో సమావేశమయ్యారు. ఏపీ కొత్త పారిశ్రామిక విధానంలో భాగంగా రక్షణ రంగం పెట్టుబడులపై ప్రత్యేకంగా దృష్టిసారించామని ఆ రంగంలో అభివృద్ధికి తగిన సహకారమందించాల్సిందిగా డీఆర్‌డీఓ చైర్మన్ గుండ్రా సతీష్‌ని కోరినట్లు మంత్రి వివరించారు.
- నౌకాదళాల అధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్‌తో కూడా సమావేశమై దొనకొండలో సోనిక్ (ధ్వని తరంగాలకు సంబంధించిన) వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. యుద్ధాల సమయంలో ఉపయోగపడే నేవల్ బేస్‌ను ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు వద్ద స్థాపించాలని కూడా కోరారు.
- వాయు సేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవాను మంత్రి కలిసి రాష్ట్రంలో రక్షణ వ్యవస్థ అభివృద్ధికి సహకారంపై చర్చించారు.
Published date : 12 Sep 2020 01:35PM