Skip to main content

నూత‌న విద్యావిధానంలో ప్రభుత్వాల జోక్యం త‌క్కువ‌గా ఉండాలి..: ప్రధాని మోదీ

సాక్షి, ఢిల్లీ : అందుబాటులో అందరికీ నాణ్యమైన విద్య ప్రధాన లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించిన నూత‌న విద్యావిధానంలో ప్రభుత్వాల జోక్యం త‌క్కువ‌గా ఉండాల‌ని ప్రధాని న‌రేంద్రమోదీ అన్నారు.
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) పై అన్ని రాష్ట్రాల గవర్నర్లు, విద్యాశాఖ మంత్రులు, వైస్‌ఛాన్సలర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ 'దేశ ఆకాంక్షల‌ను నెర‌వేర్చడానికి ముఖ్యమైన ఆయుధం విద్య. గత కొన్ని సంవత్సరాలుగా మన విద్యా విధానంలో గొప్ప మార్పులేవీ చోటు చేసుకోలేదు. దాంతో దేశంలో ఆసక్తి, సృజనాత్మకతల స్థానంలో మూక మనస్తత్వం అభివృద్ధి చెందింది. కానీ ఎన్‌ఈపీ విధానంలో అధ్య‌య‌నం చేయ‌డానికి బ‌దులు నేర్చుకోవ‌డం, అభిరుచి, ప్రాక్టికాలిటీ అనే అంశాలుంటాయి. పాఠ్యాంశాల కంటే విమ‌ర్శనాత్మక ఆలోచ‌న‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. 21వ శతాబ్దపు అవసరాలకు అనువైనదిగా తీర్చిదిద్దడంపై ఈ విధానం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఎప్పట్నుంచో ఉండే స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించి భార‌త్ మ‌రో "జ్ఞాన ఆర్థిక వ్యవస్థ" గా మారడానికి ఈ కొత్త విద్యావిధానం ఎంతో సహాయపడుతుందని' మోదీ వివ‌రించారు.

ఎలాంటి గ‌జిబిజి లేకుండా విద్యార్థుల‌కు సుల‌భంగా అర్థమ‌య్యేలా విద్యను బోధించాల‌న్నారు. ప్రతి యూనివర్శిటీ, కాలేజీకి దశలవారీగా స్వయంప్రతిపత్తి క‌ల్పిస్తామ‌ని మోదీ ప్రక‌టించారు. అంతేకాకుండా ఉత్తమ విద్యాసంస్థలకు రివార్డులు సైతం అంద‌జేస్తామ‌ని వివ‌రించారు. ఎన్‌ఈపీతో కొత్త ఆరోగ్యకర చర్చకు తెర లేచిందని, తద్వారా విద్యా విధానం మరింత మెరుగవుతుందని పేర్కొన్నారు. ఎన్‌ఈపీని విజయవంతంగా అమలు చేయడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ నూతన విద్యావిధానం–2020 (ఎన్‌ఈపీ–2020) కేంద్రం ఆమోదించిన సంగ‌తి తెలిసిందే. 34 సంవత్సరాల క్రితం నాటి జాతీయ విద్యా విధానం 1986 స్థానంలో ఇది రూపుదిద్దుకుంది. సామాజికంగా, ఆర్ధికంగా అణగారిన వర్గాల వారిపై ఈ విధానంలో ప్రత్యేక దృష్టి పెట్టారు.
Published date : 07 Sep 2020 06:29PM

Photo Stories