నూతన విద్యా విధానంపై అపోహలను నమ్మొద్దు: ఆదిమూలపు సురేష్
ఏ ఒక్క పాఠశాల మూతపడదని, ఏ ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా రద్దు కాదని స్పష్టం చేశారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచి అమలు కానున్న నూతన విధానాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కోవిడ్‌తో మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. నాడు–నేడు పనుల్లో భాగంగా క్రీడా మైదానాలు లేని పాఠశాలలకు భూములు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గురువారం సచివాలయంలో జాతీయ విద్యా విధానంపై ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయ సేకరణ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ విద్యా విధానంలో భాగంగా 5+3+3+4 విధానాన్ని అమలు చేయాలని సీఎం సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. పూర్వ ప్రాథమిక విద్యతో పాటు ఒకటి రెండు తరగతులు ప్రాథమిక విద్యలో, 3, 4, 5 తరగతులతో పాటు ఇంటర్‌ను ఉన్నత విద్యలో చేర్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ అందజేయనున్నామని, మూడో విడత జగనన్న విద్యా కానుకలో అందజేసే కిట్‌లో స్పోర్ట్సు షూస్, డ్రెస్ ఉంటాయన్నారు.
సీఎం దీర్ఘకాలిక విజన్: సజ్జల
విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్నది సీఎం జగన్ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే ఢిల్లీలో పర్యటించి అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేశామని గుర్తు చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విద్యా వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టి దీర్ఘకాలిక విజన్‌తో సీఎం ముందుకు సాగుతున్నారన్నారు.
పరీక్షల తేదీలపై సీఎం వద్ద చర్చ జరగలేదు
పదవ తరగతి, ఇంటర్ పరీక్షల తేదీలపై సీఎం వద్ద ఎటువంటి చర్చ జరగలేదని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు నోటీసుల విషయం గురించి విలేకరులు ప్రస్తావించగా.. ఆ విషయం తమ దృష్టికి రాలేదన్నారు. మొదటి నుంచి తమ నిర్ణయం ఒక్కటేనని, ఒక వేళ నోటీసులు వస్తే తమ నిర్ణయాన్ని స్పష్టం చేస్తామని తెలిపారు.
స్వాగతించిన సంఘాలు
జాతీయ విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు. కొన్ని సమస్యలను మంత్రి సురేష్, విద్యాశాఖాధికారుల దృష్టికి తెచ్చారు. ఉపాధ్యాయుల సమస్యలపై వినతిపత్రాలను సమర్పించారు.