Skip to main content

నూరు శాతం చదువుకున్న టీనేజీ అమ్మాయిలున్న నాలుగు రాష్ట్రాల్లో ఏపీకి స్థానం

సాక్షి, విశాఖపట్నం: మహిళలు విద్యావంతులైతేనే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుంది.
బాలికల అక్షరాస్యత శాతం పెరిగితే.. మాతా శిశు మరణాలను 50 శాతం వరకూ తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఎందుకంటే కౌమార దశలో దాంపత్య బంధంలోకి అడుగుపెడుతున్న బాలికల్లో ఎక్కువ శాతం మంది నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతానికి చెందినవారే. చదువుకు దూరమైన కారణంగా గర్భ నిరోధక పద్ధతులు, గర్భధారణ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకునే అవగాహన లేకపోవడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది. బాలికల్లో అక్షరాస్యత పెంచడం ద్వారానే ఈ పరిస్థితిని అధిగమించవచ్చని స్పష్టం చేసింది. ఈ విషయాలను అవగాహన చేసుకుని బాలికా విద్యకు పెద్దపీట వేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉందని మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, నాందీ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. 2019-20 సంవత్సరంలో ఈ సంస్థలు దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి.

ఏపీలో 100 శాతం అక్షరాస్యత
‘ది టీన్ ఏజ్ గర్ల్స్ (టీఏజీ)’ ప్రాజెక్టులో భాగంగా పరిశోధన నిపుణులు, లింగ నిష్పత్తి గణాంక నిపుణులు, సామాజిక, మానవ శాస్త్ర అధ్యయన నిపుణులు, న్యాయవాదులు, మానసిక ఆరోగ్య నిపుణులతో మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, నాందీ ఫౌండేషన్ సంస్థలు దేశ వ్యాప్తంగా సర్వే జరిపించాయి. 30 రాష్ట్రాల్లోని 600కుపైగా జిల్లాల్లో 74 వేల మంది టీనేజీ బాలికల్ని సర్వేలో భాగం చేశారు.

మార్పు తెస్తున్న అమ్మఒడి, నాడు-నేడు..
రాష్ట్రంలో బాలికా విద్యకు శాపంగా ఉన్న అనేక అంశాలపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దృష్టి సారించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యమిచ్చారు. పిల్లల చదువు కుటుంబానికి భారంగా మారకూడదనే ఉద్దేశంతో అమ్మఒడి పథకం పేరుతో తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేశారు. ఈ పథకం కారణంగా తమ పిల్లల్ని బడికి పంపించాలన్న ఆసక్తి ప్రతి తల్లిలోనూ పెరిగింది. అదేవిధంగా పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు నాడు-నేడు పథకాన్ని ప్రవేశపెట్టారు. పాఠశాలల్లో టాయిలెట్లు, రక్షణ గోడలు, తరగతి గదుల నిర్మాణం మొదలైన సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టారు. దీంతో బాలికా విద్యకు ప్రాధాన్యం మరింతగా పెరుగుతోందని సర్వేలో వెల్లడైంది.

ఈ సర్వే ఏం తేల్చిందంటే...
  • 13 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు గల అమ్మాయిల్లో కేరళ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలు 100 శాతం అక్షరాస్యత సాధించి ముందంజలో ఉన్నాయి.
  • ఏపీ బాలికల్లో 96.6 శాతం మందికి 19 ఏళ్లలోపు వివాహాలు చేయకుండా చదివిస్తుండగా.. పశ్చిమ బెంగాల్‌లో ఈ శాతం 88.9గా నమోదైంది.
  • 86.6 శాతం మంది టీనేజ్ బాలికలు 21 ఏళ్ల తర్వాతే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్నారు.
  • రాష్ట్రంలో 71 శాతం మంది ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షిస్తున్నారు.
  • 81.5 శాతం ఏపీ బాలికలు ఇంగ్లిష్, కంప్యూటర్ నైపుణ్యాలు నేర్చుకోవాలని అనుకుంటున్నారు.
  • 69.4 శాతం మంది ఏపీకి చెందిన టీనేజీ బాలికలు తాము చదువుకుంటున్న విద్యకు అనుగుణంగా ఉపాధి పొందాలని భావిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.
  • మన రాష్ట్రంలో 82.8 శాతం బాలికలు బహిరంగ మల, మూత్ర విసర్జన చేయకుండా సరైన పద్ధతులు పాటిస్తున్నారు.
  • 56.4 శాతం మంది టీనేజీ బాలికలు
  • రుతుక్రమం సమయంలో పరిశుభ్రమైన పద్ధతులు పాటిస్తున్నారు.
అమ్మాయిల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతోంది
యువతుల్లో ఆత్మ విశ్వాసం, స్వావలంబన, స్వతంత్ర యువతులుగా ఎదగాలన్న ఆకాంక్ష పెరుగుతోంది. బాలికలు వారి ఆకాంక్షల్ని పరిపూర్ణం చేసుకునేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. బాలికల కోసం కొత్త అవకాశాల్ని సృష్టించడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా పరిగణించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.- మనోజ్‌కుమార్, సీఈఓ, నాందీ ఫౌండేషన్
Published date : 17 Feb 2020 03:34PM

Photo Stories