Skip to main content

నిరుద్యోగుల ‘స్వయం ఉపాధి’కి ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల సహకారం!

సాక్షి, హైదరాబాద్‌: చిరుద్యోగులకు లాక్‌డౌన్‌ చిక్కులు తెచ్చిపెట్టింది. ఆయా సంస్థల యాజమాన్యాలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడంతో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది.
ఈ క్రమంలో నిరుద్యోగులను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు భావిస్తున్నాయి. 2020–21 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే కోవిడ్‌–19 ప్రభావం తీవ్రమైన విషయం తెలిసిందే. రెండున్నర నెలలు లాక్‌డౌన్‌తో గడిచాయి. అనంతరం అన్‌లాక్‌ ప్రక్రియ క్రమంగా మొదలైన నేపథ్యంలో 2020–21 వార్షిక బడ్జెట్‌ కేటాయింపులకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాయి.

చిరు ప్రోత్సాహకమే...!
కార్పొరేషన్ల ద్వారా ఇదివరకు ఎలాంటి స్వయం ఉపాధి యూనిట్‌ నెలకొల్పినప్పటికీ నిర్దేశించిన మొత్తంలో ఆర్థిక సహకారం అందేది. అయితే ఇప్పుడు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటులో ప్రత్యేక కేటగిరీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఆన్‌లైన్‌ డెలివరీ యూనిట్లు, ఎలక్ట్రానిక్‌ సర్వీసెస్, పార్శిల్‌ ఫుడ్‌ కోర్ట్‌ తదితరాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఎస్టీ కార్పొరేషన్‌ అధికారి ఒకరు తెలిపారు. రాయితీని గరిష్టంగా రూ.75 వేల వరకు పరిమితం చేయనున్నట్లు తెలుస్తోంది. స్వయం ఉపాధి యూనిట్‌ రూ.1.5 లక్షలలోపు ఉంటే గరిష్ట రాయితీ 75 వేల వరకు రాయితీ, రూ.లక్షలోపు యూనిట్‌ తెరిస్తే 50 శాతం రాయితీ వస్తుంది. మొత్తంగా ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 65 వేలు, ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా 35 వేల మంది స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నారు.
Published date : 08 Aug 2020 02:07PM

Photo Stories