Skip to main content

నీట్-యూజీ 2020 అర్హత పర్సంటైల్ తగ్గింపు: దంత వైద్య కళాశాలల్లో 7 వేల సీట్ల భర్తీకి కౌన్సెలింగ్..

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దంత వైద్య కళాశాలల్లో 7,085 సీట్ల భర్తీకి సుప్రీంకోర్టు అనుమతించింది. ఫిబ్రవరి 18 వరకు కౌన్సెలింగ్ గడువు పొడిగిస్తున్నట్లు తెలిపింది.
దంత వైద్య కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి సంబంధించి నీట్-యూజీ 2020 కనీస మార్కులు తగ్గించాలని, కౌన్సెలింగ్ గడువు పెంచాలని ఏపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక వైద్య కళాశాలల అసోసియేషన్లు, 20 ప్రైవేటు కళాశాలలు, కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. అసోసియేషన్ల తరఫున సీనియర్ న్యాయవాది మణీందర్‌సింగ్, న్యాయవాది రమేశ్ అల్లంకి, కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిలు వాదనలు వినిపించారు. జనవరి 31 కౌన్సెలింగ్ గడువు ముగిసిన తర్వాత కూడా 9 వేల సీట్లకు పైగా భర్తీ కావాల్సి ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. ఏపీలో 421, తెలంగాణలో 415 సీట్లు భర్తీ కావాల్సి ఉందని వివరించారు. వాదనలు విన్న కోర్టు ఈనెల 4న తీర్పు రిజర్వు చేసింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది.

కేంద్రం వాదన సరిగా లేదు..
2020-21లో దంత వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు మినిమం మార్కులు తగ్గించేది లేదని గత డిసెంబర్ 30న నిర్ణయం తీసుకున్నట్లు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి విచారణలో తెలిపారు. దేశంలో ప్రతీ 6,080 మందికి ఒక దంత వైద్యుడున్నట్లు కూడా పేర్కొన్నారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ‘నీట్ ప్రవేశాల్లో ఆయా వర్గాల్లో తగిన సంఖ్యలో అభ్యర్థులు కనీస మార్కులు సాధించడంలో విఫలమైనప్పుడు.. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సంప్రదించి బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి అవసరమైన కనీస మార్కులను తగ్గించే విచక్షణ కేంద్రా నికి ఉందని నిబంధనలు చెబుతున్నాయి. పర్సంటైల్ మార్కులు తగ్గించాలని గత డిసెంబర్ 28న డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోరింది. ప్రొఫెషనల్ కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉంటే దేశానికి నష్టమని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. అయితే కేంద్రం పర్సంటైల్ మార్కులు తగ్గించడానికి అంగీకరించలేదు.. కనీస మార్కులు తగ్గించడం, మొదటి సంఖ్యలో ప్రవేశాలకు పర్సంటైల్ తగ్గించడం అనేది విద్యా ప్రమాణాలను తగ్గించడం కాదన్న పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవిస్తున్నాం.. కేంద్రం వాదన సరిగా లేదు. ఖాళీగా ఉన్న 7 వేల సీట్లలో 265 మాత్రమే ప్రభుత్వ సీట్లు.. మిగిలినవన్నీ ప్రైవేటు కళాశాలల్లోనివే.. విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రవేశ రుసుము తగ్గించుకోవడానికి ప్రైవేటు దంత వైద్య కళాశాలలు అంగీకరించాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పక్కనపెడుతూ.. నీట్-యూజీ కోర్సుల్లో 2020-2021 ప్రవేశాలకు పర్సంటైల్ మార్కులు 10 శాతం తగ్గిస్తూ ఖాళీలు భర్తీ చేయాలని ఆదేశిస్తున్నాం. జనరల్ కేటగిరీలో 40, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లో 30, దివ్యాంగులు 35 పర్సంటైల్ తెచ్చుకున్న వారిని బీడీఎస్ తొలి సంవత్సరం ప్రవేశానికి పరిగణనలోకి తీసుకోవాలి. మెరిట్ ఆధారంగా ఈ నెల 18 నాటికి కౌన్సెలింగ్ పూర్తి చేయాలి. కనీస మార్కులు తగ్గకుండా, ప్రవేశాల్లో పాల్గొనడానికి అర్హత సాధించిన ఇతర అభ్యర్థులు కూడా బీడీఎస్ కోర్సు ప్రవేశాలకు పరిగణనలోకి తీసుకోవాలి..’అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

2 లక్షల మందికి చాన్స్‌..
కోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా మందికి అవకాశం దొరికిందని ఏపీ ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజ్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు గన్ని భాస్కరరావు, ఎల్.కృష్ణప్రసాద్‌లు తెలిపారు. పర్సంటైల్ మార్కులు తగ్గితే సీట్లు వృథా పోవని గుర్తించి సుప్రీంకోర్టును ఆశ్రయించామని, తర్వాత ఇతర రాష్ట్రాల అసోసియేషన్లు కూడా ముందుకురావడంతో కేసుకు మరింత ప్రాధాన్యం వచ్చిందన్నారు. దంత వైద్యుల కొరత దృష్టిలో ఉంచుకొని మార్కులు లేదా పర్సంటైల్ తగ్గించాలని, నిబంధనలు సడలించాలని కోర్టును ఆశ్రయించామని గన్ని భాస్కరరావు పేర్కొన్నారు.
Published date : 09 Feb 2021 03:58PM

Photo Stories