Skip to main content

‌నేటి నుంచి స్కూళ్లు, కాలేజీలన్నీ మూసివేత

ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో ఈనెల 24వ తేదీ నుంచి జరగాల్సిన పాలిటెక్నిక్‌ డిప్లొమా ప్రథమ, నాలుగో సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) ప్రకటించింది.
మిగతా సెమిస్టర్ల వారికి ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించాలని ఆదేశించింది. జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు తమ పరిధిలోని కాలేజీల్లో ప్రత్యక్ష బోధన చేపట్టవద్దని ఆదేశించాయి. అయితే సెమిస్టర్, సప్లిమెంటరీ పరీక్షలు మాత్రం షెడ్యూల్‌ ప్రకారం యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించాయి. అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ కూడా తమ పరిధిలో పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం నిర్వహిస్తామని వెల్లడించింది. ఇంటర్మీడియట్లో వచ్చే నెల ఏడో తేదీ నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. విద్యాసంస్థల మూసివేత నేపథ్యంలో ప్రాక్టికల్స్‌ వాయిదా పడే పరిస్థితి ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. కరోనా కేసులు పెరిగితే.. ప్రాక్టికల్స్‌కు బదులుగా ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌తో మార్కులు వేసే పరిస్థితి ఉండొ చ్చని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా విస్తృతి నేపథ్యంలో విద్యాసంస్థలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని నాలుగు రోజుల కిందట సీఎం కేసీఆర్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మంగళవారం శాసనసభలో ప్రకటన చేశారు.

‘‘దేశంలో మరోసారి కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. మన పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలోని విద్యాసంస్థల్లోనూ చెదురుమదురుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర కార్యక్రమాలు సామూహికంగా జరుగుతాయి. దానివల్ల కరోనా విజృంభించే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు విద్యాసంస్థలను మూసివేశాయి.

మన రాష్ట్రంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కరోనా వ్యాప్తి విషయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని విజ్ఞప్తులు వచ్చాయి. ఈ పరిస్థితులను సంపూర్ణంగా సమీక్షించిన మీదట.. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నింటినీ బుధవారం (24 మార్చి) నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య కళాశాలలు మినహా.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలకు వర్తిస్తాయి. విద్యార్థులకు గతంలో నిర్వహించినట్టుగా ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులు కొనసాగుతాయి..’’ అని సబితారెడ్డి ప్రకటించారు.

ప్రత్యక్ష బోధన ప్రారంభమై 50 రోజులు..
కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వం 2020 మార్చిలో విద్యా సంస్థలను మూసివేసింది. చాలా వరకు పరీక్షలను కూడా రద్దు చేసి, విద్యార్థులను ప్రమోట్‌ చేసింది. తర్వాత జూన్‌లో ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్సరం కూడా వాయిదా పడింది. చివరికి విద్యార్థులు నష్టపోతున్నారనే ఆలోచనతో.. గతేడాది సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌/ డిజిటల్‌ విద్యా బోధనను ప్రారంభించింది. చాలా వరకు కార్పొరేట్, పెద్ద ప్రైవేటు స్కూళ్లు ఆన్‌లైన్‌ విద్యా బోధన చేపట్టగా.. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ పాఠాలను (టీశాట్, దూరదర్శన్‌ పాఠాలు, యూట్యూబ్‌లో వీడియో పాఠాలు) పాఠాలను ప్రారంభించారు.

సాధారణ స్కూళ్లు కూడా ప్రభుత్వ పాఠశాలలకు అమలుచేసిన డిజిటల్‌ పాఠాలనే విద్యార్థులకు సూచించాయి. ఇలా ఐదు నెలలు కొనసాగాయి.కరోనా నిబంధనల్లో చాలా వరకు సడలింపులు ఇవ్వడం, సాధారణ జనజీవనం మొదలుకావడం, ప్రత్యక్ష బోధనకు అనుమతి ఇవ్వాలని ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఒత్తిడి తేవడంతో.. ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుంది. కాలేజీల్లో అన్ని కోర్సులకు, స్కూళ్లలో 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించవచ్చని ఫిబ్రవరి 1న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు యాజమాన్యాలు స్కూళ్లు, కాలేజీలు తెరిచాయి.

తర్వాత అదే నెల 24వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులకు కూడా ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారికి కూడా ప్రత్యక్ష బోధన మొదలైంది. ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజులు కూడా వసూలు చేసుకున్నాయి. కానీ మళ్లీ కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో విద్యాసంస్థల మూసివేతకు సర్కారు నిర్ణయం తీసుకుంది. అన్నింటిలో ఆన్‌లైన్‌ తరగతులనే కొనసాగించాలని ప్రకటించింది.

టెన్త్, ఇంటర్‌ పరీక్షలపై తర్వాత నిర్ణయం..
విద్యాసంస్థల మూసివేతపై అసెంబ్లీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన అనంతరం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దానికి అనుగుణంగా పాఠశాల విద్యా కమిషనర్‌ దేవసేన కూడా డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల బంద్‌కు సంబంధించి చర్యలు చేపట్టాలని సూచించారు. అయితే గతంలో ఆన్‌లైన్‌ విద్యా బోధన నిర్వహించినపుడు ప్రభుత్వ టీచర్లు, కాలేజీల లెక్చరర్లు రొటేషన్‌ పద్ధతితో 50 శాతం చొప్పున హాజరయ్యారు. ఇప్పుడు వారి విషయంలో స్పష్టత ఇవ్వలేదు.

షెడ్యూల్‌ ప్రకారం మే ఒకటో తేదీ నుంచి ఇంటర్, అదే నెల 17వ తేదీ నుంచి టెన్త్‌ వార్షిక పరీక్షలు జరగాల్సి ఉంది. వీటిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి తాత్కాలికంగా విద్యాసంస్థలను మూసివేస్తున్నామని.. టెన్త్, ఇంటర్, ఇతర పరీక్షల విషయంలో ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఆయా పరీక్షలకు ఇంకా సమయం ఉందని చెప్పారు.
Published date : 24 Mar 2021 04:35PM

Photo Stories