నేడు ‘స్కూల్ ఇన్నోవేషన్’ గ్రాండ్ ఫినాలే
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పాఠశాల స్థాయి విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపు, నైపుణ్యాభివృద్ధి అంశాలతో తలపెట్టిన స్కూల్ ఇన్నోవేషన్ కార్యక్రమం చివరి దశకు చేరింది.
గతేడాది ఆగస్టులో విద్యా శాఖ మంత్రి పి.సబితా రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. యూనిసెఫ్ ఇండియాతో కలిసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ ఐటీ శాఖ, ఇంక్విలాబ్ ఫౌండేషన్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పాఠశాల స్థాయిలో నెలకొన్న సమస్యలు, దానికి తక్షణ, శాశ్వత పరిష్కారం, వేగంగా చేయడం ఎలా? తదితర కోణాల్లో ఆలోచనలను స్కూల్ ఇన్నోవేషన్ కింద స్వీకరించారు. ఈ బాధ్యతలను ప్రతి జిల్లాలోజిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా సైన్స్ అధికారులకు అప్పగించారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 4,041 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి 6-10 తరగతులకు చెందిన 23,881 మంది విద్యార్థులతో కూడిన 8,750 బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొని పాఠశాల స్థాయిలో 7,093 ఆలోచనలను సమర్పించారు. ఇందులో 25 పాఠశాలల నుంచి అత్యుత్తమ ఐడియాలు వచ్చాయి. తాజాగా వీటిని వడపోసి పది ఉత్తమ ఐడియాలకు పురస్కారం దక్కనుంది. సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆడిటోరియంలో స్కూల్ ఇన్నోవేషన్ గ్రాండ్ ఫినాలేలో ఈ ఉత్తమ ఆలోచనలు సమర్పించిన 10 పాఠశాలల పేర్లు ప్రకటించి అవార్డులు అందించనున్నారు. ఈ కార్యక్రమానికి ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి తదితరులు హాజరై విజేతలకు బహుమతులు అందించనున్నారు.
Published date : 04 Jan 2021 03:35PM