Skip to main content

నాడు–నేడుతో సర్వాంగ సుందరంగా తరగతి గదులు

బంగ్లామెట్ట మున్సిపల్ స్కూలు భీమిలి నియోజకవర్గం తగరపువలసలో ఉంది.
చాలాకాలం ఒకటే తరగతి గది. పిల్లలూ తక్కువే. ప్రైవేటు ఫీజులు కట్టలేనివారు, దూరంగా వెళ్లలేని స్థానికులు మాత్రం దీన్ని ఆశ్రయించేవారు. అలాంటిదిపుడు ఈ స్కూల్లో క్లాస్‌రూమ్‌కు డిజిటల్‌ సొబగులూ వచ్చిచేరాయి. బంగ్లామెట్టకు చెందిన శీల పోలిపల్లి ఈ స్కూలును చూస్తూ... ‘‘‘నేను ఇదే మున్సిపల్‌ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశా. ఇప్పుడు నా పిల్లలు భరత్, జ్యోత్స్న ఇక్కడే చదువుతున్నారు. నేను చదువుకునేటప్పుడు ఇరవై మంది కూడా ఉండేవారు కాదు. అందరికీ ఒక్కటే తరగతి గది. నేల చదువులు. వర్షం పడితే బడికి సెలవిచ్చేసేవారు. మా పిల్లలను మంచి స్కూల్లో చదివించాలనుకున్నా. కానీ ఆర్థిక స్థోమత సరిపోక ప్రైవేటు స్కూళ్లకు పంపలేకపోయాం. ఇప్పుడు ఈ పాఠశాల ప్రైవేట్‌ స్కూళ్లను తలదన్నేలా తయారయింది. రూ.19.64 లక్షలతో ఎన్నో సౌకర్యాలు కల్పించారు. తరగతి గదులు పూర్తిగా మారిపోయాయి. ఫ్యాన్లు, గ్రానైట్‌ ఫ్లోర్, డిజిటల్‌ పరికరాలు, అందమైన డ్యుయెల్‌ డెస్క్‌లు, గ్రీన్‌ చాక్‌బోర్డులు, 53 అంగుళాల టీవీ.. ఇవన్నీ చూస్తుంటే ఇది నేను చదువుకున్న స్కూలేనా అనిపిస్తోంది’’ అంటూ ఒకింత ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

చ‌ద‌వండి: తెలంగాణ లాసెట్– 2021 షెడ్యూల్ విడుదల

చ‌ద‌వండి: తెలంగాణ ఎంసెట్ 2021 ఇంజనీరింగ్ ‘కీ’ విడుదల

చ‌ద‌వండి: ఆన్‌లైన్‌ పాఠాలు అందక... 8 లక్షల విద్యార్థులు చదువులకు దూరం..

ఇక వైఎస్సార్‌ జిల్లా కాశినాయన మండలం రెడ్డికొట్టాల ప్రాథమికోన్నత పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న కొండా దీక్షితది కూడా ఇలాంటి సంతోషమే. ‘‘మా స్కూల్లో ఇప్పుడు కూర్చోవడానికి ఏర్పాటు చేసిన బల్లలు భలేగున్నాయి. తరగతి గదులు పూర్తిగా మారిపోయాయి. గదుల్లో దేశ నాయకుల చిత్రాలు వేయించారు. సూక్తులు రాయించారు’’ అంటూ సంబరంగా చెబుతోంది. ఎప్పుడెప్పుడు స్కూలు తెరుస్తారా.. అని ఎదురు చూస్తున్నానని చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశ నాడు–నేడు కార్యక్రమం పూర్తయిన ప్రతి స్కూల్లోనూ విద్యార్థుల సంబరం ఇలానే ఉంది మరి.

ఫ్యాన్లు, లైట్లు, మురిపించే చిత్రాలు..
స్కూళ్లలో బయటకు కనిపించే భవనం... చుట్టూ ఉండే ప్రహరీకి ఎంత ప్రాధాన్యముందో... చదువుతో పాటు ఎన్నెన్నో విషయాలు నేర్చుకునే తరగతి గదికి అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యముంది. ఎందుకంటే స్కూల్లో ఉన్న సమయంలో విద్యార్థులు ఎక్కువ సమయం గడిపేది క్లాస్‌ రూమ్‌లోనే. మరి ఆ క్లాస్‌ రూమ్‌ వర్షానికి కారిపోతూనో... పగిలిపోయిన గచ్చుతోనో... విరిగిపోయిన బోర్డుతోనో దర్శనమిస్తే!!. అక్కడ ఎంత మంచి టీచరున్నా అంతగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మంచి టీచరుతో పాటు మంచి వాతావరణమూ ముఖ్యమే. ప్రైవేటు స్కూళ్లు కాస్త స్కోరింగ్‌ చేసేది ఈ పాయింట్‌ దగ్గరే. ఎందుకంటే అక్కడ మంచి టీచర్లు లేకున్నా బల్లలు, బోర్డులు బాగుంటాయి. పిల్లల్ని, తల్లిదండ్రుల్ని ఇట్టే ఆకర్షిస్తాయి. ఇప్పటి నుంచి మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఆ అవకాశాలు తక్కువే. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్లలోని తరగతి గదులు ‘నాడు–నేడు’ కార్యక్రమంతో కొత్త హంగులు దిద్దుకున్నాయి. మొత్తం 45 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో తొలి విడతగా రూపుదిద్దుకున్న 15,715 స్కూళ్లలో తరగతి గదులను తీర్చిదిద్దే పనులు దాదాపు పూర్తయ్యాయి. విద్యార్థి క్లాసులోని వాతావరణం చూసి పూర్తి స్థాయిలో చదువుపై దృష్టి పెట్టేలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. గతంలో బోధన కోసం బ్లాక్‌ బోర్డులుండేవి. అవి విద్యార్థుల కంటిపై ప్రతికూల ప్రభావం చూపించే విధంగా ఉంటాయని అధ్యయనాలు ఉండడంతో వాటి స్థానంలో గ్రీన్‌ చాక్‌ బోర్డులను ఏర్పాటు చేశారు. ఆ పక్కనే జాతీయ నేతలు, స్వాతంత్య్ర ఉద్యమ కారులు, శాస్త్రవేత్తలు, ఇతర రంగాల నిపుణుల ఫొటోలను, వివిధ ప్రయోగశాలల్లో జరిగే కార్యక్రమాలను చిత్రించారు. ఇందుకు నిపుణులైన ఆర్కిటెక్టులు, చిత్రకారులు, ఇతరుల సహకారాన్ని తీసుకున్నారు. ప్రతి స్కూల్లో విద్యుత్‌ సౌకర్యం కల్పించారు. ట్యూబ్‌ లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు, టీచర్లకు సరిపడా బెంచీలు, అల్మారాలు ఇతర ఫర్నిచర్‌ను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందుకే... ఈ నెల 16వ తేదీన ప్రభుత్వ స్కూళ్లను పునః ప్రారంభిస్తున్న నేపథ్యంలో బడికి వెళ్లటానికి మారాం చేసిన పిల్లలు సైతం ఎప్పుడు స్కూలు తెరుస్తారా అని ఎదురు చూస్తున్న పరిస్థితులున్నాయనటం అతిశయోక్తేమీ కాదు. పిల్లలు స్కూలు ఆవరణలోకి రాగానే వారికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా రాజ మార్గాలు ఏర్పాటు చేశారు. దూరం నుంచి చూడగానే ప్రతి వారికి కనిపించేలా ఆ స్కూలు పేరుతో కూడిన పెద్దపెద్ద బోర్డులను ప్రవేశ ద్వారం ముందు ఏర్పాటు చేయించారు. తరగతి గదుల్లోనే కాకుండా స్కూలు బయట ఆవరణలో కూడా పిల్లలకు ఉపయోగపడేలా వారి పాఠాలను వారి కళ్ల ముందుంచేలా పలు బొమ్మలను, చిత్రాలను గోడలపై వేయించారు.

ఉపాధ్యాయుడిగా నా సర్వీసులోనే కాదు విద్యాశాఖ సర్వీసులోనే పాఠశాలలకు ఇన్ని నిధులు సమకూర్చి అభివృద్ది చేసిన ధాఖలాలు ఎప్పుడూ లేవు. పట్టణంలో బీవీఆర్‌ఎం పాఠశాల అంటే ఎంతో పేరుంది. ఇన్నాళ్లూ అసౌకర్యాల మధ్య చదువు కొనసాగింది. ఇప్పుడా పరిస్థితి లేదు. నాడు–నేడులో భాగంగా మా పాఠశాలకు రూ.61.43 లక్షలు ఇచ్చారు. ప్రతి గదికి ఐదు ప్యాన్‌లు, నాలుగు ట్యూబ్‌లైట్లు, బెంచీలు, సందేశాత్మక చిత్రాలు, సూక్తులు, ఆకర్షణీయమైన ముఖద్వారం.. ఇలా ఎంతగానో తీర్చిదిద్దారు. 350 మంది విద్యార్థినులు ఉన్న ఈ పాఠశాలలో ఆ సంఖ్య ప్రస్తుతం 670 మందికి చేరింది. హౌస్‌ఫుల్‌ బోర్డు పెట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది.
– వై.ప్రభాకరశాస్త్రి, హెచ్‌ఎం, బీవీఆర్‌ఎం బాలికల హైస్కూల్‌
Published date : 14 Aug 2021 03:57PM

Photo Stories