Skip to main content

మీ పిల్లలు ఆన్‌లైన్ క్లాసులు అటెండ్ అవుతున్నారా?.. ఇది మీ కోసమే

ఇటీవల కరోనా విస్తరించిన నాటి నుంచి చిన్నక్లాసుల వారినుంచి మొదలుకొని... ఇంటర్మీడియట్ వరకూ పిల్లల్లో చాలామంది ఆన్‌లైన్ క్లాసులు అటెండ్ అవుతున్నారు.

వీళ్లలో కొందరు తమ మొబైల్స్‌లో క్లాసులు చూస్తుంటే... మరికొందరు ఇళ్లలోని కంప్యూటర్ ముందు కూర్చుని క్లాసులు అటెండ్ అవుతుంటారు. అది మొబైల్ అయినా... కంప్యూటర్ అయినా కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల పిల్లల్లో వచ్చే మెడనొప్పులు, నడుం నొప్పులు ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ సందర్భంగా డాక్టర్ సుధీంద్ర ఊటూరి (లైఫ్ స్టైల్ మెడిసిన్ )సూచించిన కొన్నిజాగ్రత్తలను పరిశీలిద్దాం...

సాధారణంగా చిన్నపిల్లలోనూ, టీనేజ్ పిల్లల్లోనూ ఒళ్లునొప్పులు, మెడనొప్పి, నడుంనొప్పి వంటి సమస్యలు రావడం అరుదు లేదా ఒకింత తక్కువే అని చెప్పవచ్చు. అయితే ఆన్‌లైన్ క్లాసులు అటెండ్ అయ్యే క్రమంలో అదేపనిగా ఒకే భంగిమలో (పోష్చర్‌లో) కూర్చోవడం వల్ల కొందరిలో ఒళ్లునొప్పులు, నడుం నొప్పులు రావచ్చు. అందుకే ఎలాగూ క్లాసులకు అటెండ్ కావడం ఇంటిలోనే జరుగుతుంది కాబట్టి... ప్రతి అరగంటకూ, లేదా 45 నిమిషాలకొకసారి కాస్తంత లేచి కూర్చోవడం, కూర్చున్న పోష్చర్ మార్చుకుంటూ ఉండటం అవసరం.

  • పిల్లలు వీలైనంతవరకు వెనక ఆను ఉన్న కుర్చీలో... వెనక్కు ఆనుకుని నిటారుగా కూర్చోవడం మంచిది.
  • వెనక ఆనుకునే సౌకర్యం లేకుండా ఒకవేళ మంచం, సోఫా, ఈజీ చెయిర్‌లో కూర్చున్నప్పుడు వీపుకి సరైన ఆధారం లేకుండా అదేపనిగా కూర్చోవడమో లేదా గంటకు మించి కూర్చోవడమో చేయకూడదు. క్లాసులకోసం ఆనుకునే సౌకర్యం ఉన్న కుర్చీ అందునా నిలువుగా కూర్చోగలిగేదే ఎంచుకోండి.
  • నోట్స్ రాసేటప్పుడు రైటింగ్ ప్యాడ్‌లను వాడండి. ఇలా రాసే సమయంలో పూర్తిగా ముందుకు ఒంగిపోకండి. రాశాక లేదా రాసే క్రమంలో మాటిమాటికీ మెడలు పైకి లేపుతూ నిటారుగా మారుతూ ఉండండి.
  • కంప్యూటర్‌కూ లేదా మొబైల్ పెట్టుకోడానికి తగినంత సౌకర్యంగానూ, సరైన ఎత్తులో ఉండే టేబుల్‌పైన వాటిని అమర్చుకోండి. మీకు బాగా కంఫర్టబుల్‌గా ఉన్న పోష్చర్‌ను ఎంచుకున్న తర్వాత దాన్ని పదే పదే మార్చకండి.
  • మెడ, నడుము ఇలా ఎక్కడైనా నొప్పి వస్తే మీరు కూర్చునే భంగిమ మార్చి మార్చి ప్రయత్నించండి.
  • ఒకవేళ ఎప్పుడైనా మెడ లేదా నడుము లేదా ఒళ్లునొప్పులు వస్తే నేరుగా నొప్పి నివారణ మందులు వాడకండి. నొప్పి వచ్చిన చోట వేడి నీటి కాపడాన్ని పెట్టుకోండి. రోజులో రెండు సార్లు పెట్టుకుంటూ ఉంటే చాలావరకు ఉపశమనం ఉంటుంది.
  • అప్పటికీ నొప్పి తగ్గక పోతే ఫిజిషియన్‌కు చూపించండి.

క్లాసెస్ అటెండ్ అవుతూ వ్యాయామాన్ని విస్మరించకండి. ఈ కరోనా సీజన్‌లో బయటికి వెళ్లేందుకు ఇష్టం లేకపోతే ఇంట్లోనే తేలికపాటి శారీరక శ్రమ, తేలికపాటి వ్యాయామాలు చేయండి.

Published date : 10 Dec 2020 04:08PM

Photo Stories