Skip to main content

మైనారిటీ గురుకుల టీచర్లకు డ్రెస్‌కోడ్‌!

హిజాబ్కు నిబంధనలు ఆటంకమని మతపెద్దల అభ్యంతరం
మైనారిటీ గురుకుల విద్యాసంస్థల్లో టీచర్లకు డ్రెస్‌కోడ్‌ నిబంధన వివాదాస్పదంగా మారుతోంది. ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీల కోసం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో సంప్రదాయానికి విరుద్ధంగా మహిళా సిబ్బంది బురఖా, హిజాబ్‌ ధరించేందుకు వెసులుబాటు లేకుండా పోతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఏ గురుకులంలోనూ లేనివిధంగా మైనారిటీ గురుకులాల్లో టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి డ్రెస్‌కోడ్‌ నిబంధన వర్తింపజేయడమేమిటని ముస్లిం సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు కోవిడ్‌ కష్టకాలంలో డ్రెస్‌కోడ్‌ నిబంధన ఔట్‌ సోర్సింగ్‌ కింద పనిచేస్తున్న టీచర్లకు ఆర్థికభారంగా తయారైంది. మైనారిటీ గురుకుల పాఠశాలలోని ఉపాధ్యాయుల వృత్తిపర నిబద్ధత, నిర్వహణను తెలియజేసేవిధంగా ఒకే డిజైన్, రంగు గల డ్రెస్సులు ధరించాలని టెమ్రిస్‌ కార్యదర్శి ఉత్తర్వు జారీ చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 10న డ్రెస్‌కోడ్‌పై సర్క్యులర్‌ జారీ చేసి ఈ నెల 22 నుండి అమలుకు శ్రీకారం చుట్టడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళాటీచర్లు ఏదైనా ఒక కలర్‌ గల ప్లేన్‌ శారీ, లేదా షర్ట్, సల్వార్‌ ధరించాలని నిబంధన విధించడం తగదని, బురఖా, హిజాబ్‌ ధరించడం ముస్లిం సంస్కృతి అని మేవా అనే సంస్థ అధ్యక్షుడు మహ్మద్‌ మసూద్‌ అహ్మద్‌ అన్నారు.
Published date : 23 Feb 2021 05:12PM

Photo Stories