Skip to main content

మార్కులే సర్వస్వం కాదు: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం ఒక్కటే సర్వస్వం కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.
అలాగే ప్రతి ఇంట్లోనూ సాంకేతికపరికరాలు లేని గది ఒకటి ఉండాలని, అందులోకి వెళ్లేవాళ్లు గ్యాడ్జెట్లను తీసుకువెళ్లే అవకాశం ఉండకూడదని ఆయన సూచించారు. స్థానిక తాల్‌కటోరా స్టేడియంలో సోమవారం ‘పరీక్షా పే చర్చ’కార్యక్రమంలో భాగంగా విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. అయితే గ్యాడ్జెట్లు మన జీవితాన్ని శాసించే స్థితిని తెచ్చుకోవద్దు’అంటూ హితవు పలికారు. విద్యార్థులు తనతో ఎంచక్కా మాట్లాడవచ్చన్నారు. ప్రతి విద్యార్థీ కొంత సమయం పెద్దలకోసం కేటాయించాలన్నారు. వైఫల్యాలకు విద్యార్థులు ఎట్టిపరిస్థితుల్లోనూ వెరవకూడదని, అది జీవితంలో ఓ భాగమని చెప్పారు. ‘చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమవు తుందని నమ్మకం లేనందువల్ల ఆ కార్యక్రమానికి తాను రానవసరం లేదని చెప్పారని, అయినా తాను ఉండాల్సిన అవసరం కలిగిందని’గుర్తుచేశారు. విద్యార్థులు చదువుతోపాటు విద్యేతర వ్యాపకాలకూ ప్రాధాన్యమివ్వాల్సిన అవసరాన్ని మోదీ ఈ సందర్భంగా నొక్కివక్కాణించారు. తమ పిల్లలకు పేరు, గుర్తింపు వచ్చే కార్యక్రమాలకు మాత్రమే తల్లిదండ్రులు ప్రాధాన్యమిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు ఏమికావాలని కోరుకుంటున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని, పదిమందితో మాట్లాడే సమయంలో గర్వకారణంగా ఉండేలా తమ పిల్లల గురించి చెప్పుకునేలా ఉండాలని అభిలషిస్తున్నారన్నారు. చదువుకోవాలంటూ పిల్లలపై ఒత్తిడి చేయొద్దని ఆయన విన్నవించారు. పరీక్ష ఒత్తిళ్లను అధిగమించేందుకు విద్యార్థులు తాను రచించిన ‘ఎగ్జామ్ వారియర్’పుస్తకం చదవాలని సూచించారు. చదువు విషయంలో పిల్లలను ఒత్తిడి చేయడం సరికాదని, పిల్లల శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వచ్చేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. పరీక్షలకు సన్నద్దమయ్యే విషయంలో పిల్లలకు సంపూర్ణ ఆత్మవిశ్వాసం ఉండాలన్నారు. ‘ఒత్తిడితో పరీక్ష గదిలోకి అడుగుపెట్టవద్దు.ఇతరులు ఏమిచేస్తున్నారనే విషయాన్ని పట్టించుకోవద్దు. ఆత్మవిశ్వాసంతో ఉండండి. పరీక్షకు మీరు ఎలా సిద్ధమయ్యారనే దానిపైనే దృష్టి సారించండి’అని ప్రధాని సూచించారు.
Published date : 21 Jan 2020 02:39PM

Photo Stories