Skip to main content

మార్చిలోగా ‘మన బడి నాడు–నేడు’ మొదటి విడత పూర్తి: ఆదిమూలపు సురేశ్

సాక్షి, అమరావతి: ‘మన బడి నాడు–నేడు’ పథకం కింద మొదటి దశలో 15,700 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులను మార్చిలోగా పూర్తి చేస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.3,669 కోట్ల వ్యయంతో మొదటి విడత నాడు–నేడు పనులను గతేడాది జూన్‌లో చేపట్టామని.. ఇప్పటివరకు రూ.2,570 కోట్ల విలువ చేసే పనులు పూర్తి చేశామని చెప్పారు. ఫ్యాన్లు, ఫర్నీచర్, గ్రీన్‌ బోర్డులను రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా కొనుగోలు చేసి రూ.245 కోట్లు ఆదా చేశామన్నారు. ఏప్రిల్‌ 1 నుంచి రెండో విడత నాడు–నేడు పనులకు శ్రీకారం చుడుతున్నామని వివరించారు. పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు, టీచర్లకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో 10 అంశాల్లో మూడు విడతలుగా నాడు–నేడు పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. నాడు నేడు రెండో దశ పనులను ఏప్రిల్‌లో చేపట్టి నవంబర్‌ నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు.

సీఎం నిర్దేశించిన లక్ష్యం మేరకు..
15,700 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర పనులు పూర్తి చేశామని, సీలింగ్‌ ఫ్యాన్లు, గ్రీన్‌చాక్‌ బోర్డులు కూడా పూర్తిగా పాఠశాలలకు సరఫరా అయ్యాయని, వాటిని ఫిక్సింగ్‌ చేయాల్సి ఉందని మంత్రి సురేశ్‌ చెప్పారు. అల్మరాలు 66 శాతం, గ్రీన్‌ బోర్డులు 89 శాతం పూర్తయ్యాయన్నారు. వాల్‌ ఆర్ట్స్‌ మినహా పెయింటింగ్‌ పనులు పూర్తవుతున్నాయని, తాగునీటి కల్పన పనులను 39 శాతం పూర్తి చేశామని తెలిపారు. స్మార్ట్‌ టీవీలను 50 శాతం మేర అమర్చామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్దేశించిన లక్ష్యం మేరకు మిగిలిన పనులను మార్చి నెలాఖరుకు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే.. కొన్ని పత్రికలు ‘నాడు నేడు ఏనాటికో’ అని రాస్తున్నాయని, కళ్లుండి కబోధుల్లా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు ఏ స్కూల్‌కు వెళ్లి చూసినా నేను చెబుతున్న వాస్తవాలు కళ్లకు కనిపిస్తాయని.. అలా లేవంటే దేనికైనా తాను సిద్ధమని సవాల్‌ విసిరారు. కాంట్రాక్టర్లతో కాకుండా పాఠశాలల పేరెంట్స్‌ కమిటీలతో ఫర్నీచర్, ఫ్యాన్లు, గ్రీన్‌ బోర్డులు, విద్యుత్, తాగునీరు, తదితర మౌలిక వసతుల కల్పనకు నిధులు ఖర్చు చేయించామన్నారు.

దేశానికే ఆదర్శం.. ‘నాడు–నేడు’
నాడు–నేడు పనులకు సంబంధించిన అన్ని విషయాలను తమ ప్రభుత్వం పబ్లిక్‌ డొమైన్‌లో పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉంచిందని మంత్రి సురేశ్‌ తెలిపారు. ఏ నిమిషంలో ఎంత ఖర్చు పెడుతున్నామో చూసుకోవచ్చన్నారు. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఏపీలో అమలవుతున్న నాడు నేడు పనులను త్వరలో స్వయంగా వచ్చి పరిశీలిస్తానని ఇటీవల ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మౌలిక వసతుల కల్పన వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది చేరికలు పెరిగాయన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో గత ఏడాది 38 లక్షల మంది విద్యార్థులు ఉండగా ఈ ఏడాది ఆ సంఖ్య 42.33 లక్షల పైచిలుకు చేరిందన్నారు.
Published date : 25 Feb 2021 01:28PM

Photo Stories