Skip to main content

మా ఉద్యోగుల భద్రతకు తగ్గేది లేదు... ప్రతీ ఉద్యోగికి అదనంగా..

న్యూఢిల్లీ: కరోనా బాధిత ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు నిర్మాణ రంగ దిగ్గజ కంపెనీ ఎల్‌అండ్‌టీ ముందుకు వచ్చింది. ప్రతీ ఉద్యోగికి అదనంగా రూ.35 లక్షల కరోనా బీమా కవరేజీని ప్రకటించింది. అంటువ్యాధుల కవరేజీ ప్లాన్‌ కింద రూ.35 లక్షల బీమాను 12 నెలల కాలానికి అందించనున్నట్టు తెలిపింది. ఈ పాలసీ కింద కరోనా కారణంగా మరణించిన ఉద్యోగికి రూ.35 లక్షల పరిహారం లభించనుంది. ఇప్పటికే ప్రతీ ఉద్యోగికి అందిస్తున్న రూ.50-60 లక్షల టర్మ్‌ ఇన్సూరెన్స్‌కు ఇది అదనం. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు రూ.2-12 లక్షల మధ్య ఆప్షనల్‌ టాపప్‌ మెడికల్‌ హాస్పిటలైజేషన్‌ కవరేజీని 365 రోజులకు అందిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది.
ఎన్నో సవాళ్లతో...
ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు రూ.6.25 లక్షల వరకూ మెడికల్‌ కవరేజీ కూడా ఉంటుందని ఎల్‌అండ్‌టీ తెలిపింది. మరణించిన ఉద్యోగి పిల్లల చదువులకు కూడా సాయాన్ని ప్రకటించింది. 3 నుంచి 25 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లల విద్యకు అయ్యే వ్యయాలను సంస్థే భరించనుంది. ఉద్యోగి జీవిత భాగస్వామికి వృత్తి శిక్షణ, విద్య అందించి ఉపాధి కల్పించనున్నట్టు తెలిపింది. ‘‘ఎన్నో సవాళ్లతో కూడుకున్న కాలం ఇది. కరోనా రెండో దశ గట్టిగానే తాకింది. కరోనా కారణంగా ప్రభావితమైన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవడంలో వెనుకాడేది లేదు. మా ఉద్యోగులకు సాయంగా ఉండేందుకు సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలు ఇవి’’ అని ఎల్‌అండ్‌టీ ఎండీ, సీఈవో ఎస్‌ఎన్‌ సుబ్రమణియన్‌ తెలిపారు.
Published date : 01 Jun 2021 05:08PM

Photo Stories