లక్ష్యాన్ని గురించే ఎప్పుడూ ఆలోచించాలి!
Sakshi Education
శివుణ్ణి ఆరాధించడానికి నిశ్చయించుకుని అర్జునుడు ముందుకు సాగాడు.
దారిలో అతడికి మనోహరమైన వనం ఒకటి కనిపించింది. అక్కడి పూల చెట్లు చాలా అందంగా సువాసనలు వెదజల్లుతున్నాయి. శివుడి కోసం తపస్సు చేయడానికి అది చాలా అనుకూలమైన ప్రదేశంగా అర్జునుడికి తోచింది. అర్జునుడు నార బట్టలు ధరించి నాలుగు నెలలపాటు కఠోర తపస్సు చేశాడు. దానితో అతడి శరీరంలోనుంచి దారుణమైన వేడిపుట్టి, వనమంతా పొగ చుట్టేసింది. దీనిని గమనించిన వనంలోని రుషులు శివుడి వద్దకు వెళ్లి అర్జునుడిని తపస్సు మానుకునేలా చేయాలంటూ బతిమాలారు.తాను అర్జునుడి కోరిక తీర్చబోతున్నాననీ, భయపడవద్దనీ శివుడు వారికి చెప్పాడు. జీవితంలో దేనినైనా సాధించలంటే దానికోసం గొప్ప ప్రయత్నం చేయాలి. శక్తికొద్దీ ప్రయత్నిస్తే తప్ప ఏ పనినైనా సాధించడం అసలు కుదురుతుందా స్వామి వివేకానంద అంటారు. ఏకాగ్రత పదినిముషాలలో సాధించేది కాదు. దానికోసం మనం చేసే పనిని వదలకుండా ప్రయత్నించాలి. అర్జునుడు అదేవిధంగా ఈశ్వరుడి కోసం తపస్సు చేశాడు. తపస్సు అంటే మనస్సును పూర్తిగా ఒక విషయంపై కేంద్రీకరించి ఆ విషయం పూర్తిగా అవగాహనకు వచ్చే వరకు దాన్ని వదలకుండా ఉండడం. అర్జునుడు ఈ తపస్సు ద్వారా తాను కోరుకున్న విద్యలన్నింటిని నేర్చుకున్నాడు. ప్రపంచంలోని విజ్ఞానమంతా ఏవిధంగా సంపాదించబడింది.మానసిక శక్తులను కూడగట్టి ఏకాగ్రం చేయడం ద్వారా మాత్రమే ఇది సాధ్యపడింది. మనం గట్టిగా తట్టగలిగితే ఈ సృష్టి, దాని రహస్యాలన్నింటిని ఇచ్చి వేయటానికి సిద్ధంగా ఉంది. దానికి అవసరమైన దెబ్బను ఎలా వెయ్యాలో మనకి తెలిస్తే చాలు. ఏకాగ్రత ద్వారా ఆ దెబ్బ వేయడానికి అంతులేదు. అది ఎంత ఏకాగ్రతమైతే అంత శక్తి ఒకే విషయం మీద కేంద్రీకరించబడుతుంది.అదే ఏదో ఒక పద్దతిలో ఏకాగ్రతను సాధించిన తర్వాత అదే శక్తితో అన్ని విషయాలనూ నేర్చుకోవచ్చు.
Published date : 03 Jan 2020 03:08PM