లేలేత వయసులోనే పిల్లల్ని తీర్చిదిద్దాలి...!
Sakshi Education
‘‘మొకై వంగనిదే మానై వంగునా? ’’ అంటారు. ఒకసారి ఒక గురువుగారు తన శిష్యుడితో కల్సి అడవి మార్గాన నడిచి వెళుతున్నారు.
దారిలో కనబడిన చిన్న మొక్కను చూపించి ‘‘నాయనా! ఆ మొక్కను పీకేసెయ్’’ అంటాడు గురువు తన శిష్యుడితో. ‘‘అలాగే! గురువుగారు’’ అని శిష్యుడు ఆ మొక్కను తన చేతి వేళ్లతోనే పీకేశాడు. కొద్ది దూరం వెళ్లాక తర్వాత ఒక పెద్ద మొక్క కనిపిస్తుంది. దాన్ని కూడా పీకెయ్యమని శిష్యుడికి చెప్పారు. ఈ సారి శిష్యుడు ఒక చేత్తో గట్టిగా పట్టుకొని ఆ మొక్కను లాగిపారేశాడు. గురుశిష్యులిద్దరూ ముందుకు సాగిపోతూ ఉంటే, ఈ సారి ఇంకా పెద్దమొక్క కనపడింది. ‘‘నాయనా! ఆ మొక్కను కూడా పీకేస్తావా?’’ అన్నారు గురువు గారు. ‘‘అలాగే’’ అని శిష్యుడు రెండు చేతులతో గట్టిగా పట్టుకొని గుంజాడు.అది కూడా వచ్చేసింది. గురువుగారు శిష్యుడిని మెచ్చుకున్నారు. ఇద్దరూ అలా ముందుకు వెళుతూ ఉంటే ఒక చెట్టు కనపడింది. గురువు గారు ఆ చెట్టు వద్ద ఒక క్షణం ఆగి ‘‘శిష్యా! ఈ చెట్టు కూడా పీకెయ్యగలవా?’’ అని అడిగారు. శిష్యుడు ఆశ్చర్యపోయి ‘‘అదెలా సాధ్యం గురువు గారు?’’ అన్నాడు. ‘‘నువ్యు నిజమే చెప్పావు నాయనా? చెట్టును పీకడం సాధ్యం కాదు. అందుకే ఏ మనిషైనా చెడ్డ ఆలోచనలు, చెడు అలవాట్లు చిన్న మొక్కగా ఉన్నప్పుడే పీకెయ్యాలి. చెట్టయ్యే వరకు ఎదగనిస్తే ఎంతో కష్టమవుతుంది. ‘‘అర్థమైందా శిష్యా?’’ అన్నాడు. ‘‘మీ బోధ నాకు చాలా బాగా అర్థమైంది గురుదేవా! ధన్యవాదాలు అన్నాడు శిష్యుడు. ఈ కథ చదివాక మనలోని చెడు చిన్న మొక్కలా ఉందా, పెద్ద మొక్కలా ఉందా తెలుసుకొని వెంటనే పీకి పారేస్తే అది చెట్టుగా మారే ప్రమాదం తప్పుతుంది. ఎందుకంటే ‘‘చెడు అలవాటును వెంటనే వదలకపోతే అది అలవాటుగా మారే ప్రమాదం ఉందంటాడు’’ - సెయింట్ అగస్టీన్. ఇది చెయ్యాలంటే ఒక విద్యార్థి విజయానికి చదువు ఎంత ముఖ్యమో సంస్కారం అంతకన్నా ముఖ్యమని తెలుసుకోవాలి. సంస్కారం లేని వాడి వల్ల సమాజానికి ఇబ్బందే తప్ప ఒరిగేదేమీ ఉండదని గుర్తుంచుకోవాలి.
Published date : 31 Jan 2020 03:02PM