Skip to main content

లాక్‌డౌన్‌లో ఉద్యోగం పోయిందా?.. అయితే ఇది మీ కోసమే!

సాక్షి, అమరావతి: విజయవాడకు చెందిన ప్రవీణ్ కుమార్ స్టీల్ పాత్రలు తయారు చేసే సంస్థలో ఉద్యోగి. లాక్‌డౌన్‌తో ఉపాధిని కోల్పోయారు. కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐ) ఆధ్వర్యంలోని పథకం ద్వారా నిరుద్యోగ భృతిని పొంది కుటుంబాన్ని నెట్టుకొచ్చారు.
ఇలా రాష్ట్రంలో వేలాది మంది ‘అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన (ఏబీవీకేవై)’తో లబ్ధి పొందారు. విపత్కర పరిస్థితుల్లో ఉపాధిని కోల్పోయిన కార్మికవర్గం కోసం కేంద్రం ఈ పథకాన్ని ఈఎస్‌ఐ ద్వారా అమలు చేస్తోంది. ఎవరైనా లబ్ధి పొందాలనుకుంటే డిసెంబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈఎస్‌ఐ పరిధిలోని కార్మికులకే ఇది వర్తిస్తుంది.

ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలంటే..
esic.in/employee పోర్టల్‌లోకి లాగిన్ కావాలి. ఏబీవీకేవై క్లెయిమ్ పొందేందుకు ఉద్దేశించిన విభాగంపై క్లిక్ చేయాలి. ఆ దరఖాస్తులో నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలనుకుంటున్నారో నమోదు చేసి సబ్‌మిట్‌పై క్లిక్ చేయాలి. నిరుద్యోగ కాల వివరాలను నమోదు చేసిన ఏబీ-1 ఫారం ప్రింట్ తీసుకొని అందులో ఉన్న విషయాన్ని రూ.20 స్టాంప్ పేపర్‌పై టైపు చేయించి నోటరీ చేయించాలి. దానిపై దరఖాస్తుదారు సంతకం చేయాలి. ఏబీ-2 అనే ఫారంనూ ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. దానిపై సంబంధిత కంపెనీ యాజమాన్యం సంతకం తీసుకోవాలి. యాజమాన్యం ధ్రువీకరించకపోతే పీఎఫ్ నంబర్‌ను దరఖాస్తుపై వేసి ఈఎస్‌ఐ కార్యాలయంలో సమర్పించాలి. ఈఎస్‌ఐ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు అఫిడవిట్‌కు జత చేయాలి. నిరుద్యోగ భృతి కావాలనుకున్న సమయంలో సంబంధిత దరఖాస్తుదారు ఉద్యోగం లేకుండా ఉండాలి. ఉద్యోగం పోగొట్టుకోవడానికి ముందు కనీసం రెండేళ్లపాటు ఆయా సంస్థల్లో పని చేసి ఉండాలి. ఏదో ఒక కారణంతో ఉద్యోగం పోగొట్టుకున్న వారు దీనికి అనర్హులు. ఉద్యోగులను తీసివేసినట్టు యాజమాన్యాలు ధ్రువీకరించకపోతే సమీపంలోని ఈఎస్‌ఐ కార్యాలయంలో అధికారిని సంప్రదించాలి.
Published date : 11 Nov 2020 01:46PM

Photo Stories