Skip to main content

కరోనా విద్యార్థులకు నాలుగేళ్లపాటు మల్లారెడ్డి వర్సిటీలో ఉచిత విద్య.. అడ్మిషన్లు ప్రారంభం

మేడ్చల్‌ రూరల్‌: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో 2021–22 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభించినట్లు యూనివర్సిటీ వీసీ వీఎస్‌కే రెడ్డి తెలిపారు.
గురువారం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. ఈ ఏడాది 70 కోర్సులను అదనంగా ప్రారంభిస్తున్నామని, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, పారామెడికల్‌ సైన్సెస్, మేనేజ్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీస్‌ వంటి పలు రకాల కోర్సులు విశ్వవిద్యాలయంలో ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా కారణంగా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు నాలుగేళ్లపాటు వర్సిటీలో ఉచితంగా విద్య అందిస్తామని తెలిపారు. అయితే ఇంటర్మీడియట్‌లో 70 శాతానికి పైగా మార్కులు సాధించి ఉండాలని పేర్కొన్నారు. పారిశ్రామిక అవసరాలు తీర్చేలా అండర్‌ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సులు అందిస్తున్నామని వర్సిటీ చాన్స్‌లర్‌ డీఎన్‌ రెడ్డి చెప్పారు. సమాజంలోని వైద్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మెడికల్‌ సైన్స్‌, పారామెడికల్‌ సైన్స్‌ కోర్సులను అందిస్తున్నామని డైరెక్టర్లు భద్రారెడ్డి, మహేందర్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో ప్రీతీరెడ్డి, శాలినీరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.
Published date : 18 Jun 2021 02:04PM

Photo Stories