కేజీబీవీల్లో వొకేషనల్ కోర్సులు!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) వొకేషనల్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
వాటిల్లో చదివే వారంతా బాలికలే అయినందునా పదో తరగతి పూర్తయిన వారి కోసం వాటిని ప్రవేశపెట్టాలని, తద్వారా ఉపాధి అవకాశాలను కల్పించవచ్చని భావిస్తోంది. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వంటి కోర్సులను వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. అలాగే రాష్ట్రంలోని మరో 50 కేజీబీవీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్‌ను ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 475 కేజీబీవీలు ఉండగా, అందులో గతేడాది 84 కేజీబీవీల్లో ఇంటర్‌ను ప్రారంభించింది. అంతకుముందు సంవత్సరంలో 88 స్కూళ్లలో ఇంటర్మీడియెట్‌ను ప్రవేశపెట్టింది. ఈసారి జిల్లాకు ఒకటి లేదా రెండు చొప్పున కేజీబీవీల్లో ఇంటర్‌ను ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. దీంతో ఇప్పటివరకు 172 కేజీబీవీల్లో ఇంటర్మీడియెట్ ఉండగా, ఈసారి ప్రవేశపెట్టే వాటితో కలుపుకొని వాటి సంఖ్య 222కు చేరనుంది.
Published date : 31 Jan 2020 02:46PM