‘కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్’లో నియామకాలు సరికాదు: హైకోర్టు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు బోధన సిబ్బంది పోస్టులను శాశ్వత పద్ధతిలో కాకుండా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తుండటాన్ని హైకోర్టు తప్పుపట్టింది.
ఇలా ఏళ్ల తరబడి చేస్తున్న నియామకాల వల్ల ‘రూల్ ఆఫ్ రిజర్వేషన్’ అమలు కావడం లేదని ఆక్షేపించింది. కాంట్రాక్ట్ పద్ధతిలో నియమితులైనవారిని తొలగించి ఏటా మళ్లీ కొత్త వారి కోసం వర్సిటీలు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయని.. ఇది ఏమాత్రం సహేతుకం కాదని తెలిపింది. మంజూరు చేసిన పోస్టుల్లో అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులను శాశ్వత ప్రాతిపదికన నియమించకపోవడం వల్ల ఆయా వర్సిటీల నుంచి ప్రతిభావంతులైన గ్రామీణ యువతను తయారు చేయాలన్న ఉద్దేశం నెరవేరకుండా పోతుందని విచారం వ్యక్తం చేసింది. అంతిమంగా విద్యార్థుల జీవితాలు కూడా ప్రభావితం అవుతున్నాయంటూ కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. కాంట్రాక్ట్, తాత్కాలిక బోధన సిబ్బంది నియామకం కోసం ఆర్జేయూకేటీ రిజిస్ట్రార్ ఈ ఏడాది జనవరి 8న జారీ చేసిన నోటిఫికేషన్ అమలును నిలిపేసింది. పిటిషనర్లను తొలగించవద్దని వర్సిటీ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, వర్సిటీ రిజిస్ట్రార్‌కు సూచించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 5కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్ట్, తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న తమ సర్వీసులను క్రమబద్ధీకరించకుండా, కాంట్రాక్ట్ పద్ధతిలో బోధన సిబ్బంది నియామకం కోసం ఆర్జేయూకేటీ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ కుంచెం గణేశ్‌రెడ్డి, మరో 10 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Published date : 10 Mar 2021 04:20PM