కాలేజీలపై ఏం చర్యలు తీసుకున్నారు?: హైకోర్టు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు కళాశాలలు అగ్నిమాపక నిబంధనలు పాటించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.
కొన్ని కళాశాలలు కేవలం లాభాల కోసం నడుపుతున్నారని, కళాశాలల యాజమాన్యాల స్వలాభం కోసం విద్యార్థుల జీవితాలను ఫణంగా పెట్టవద్దని తేల్చిచెప్పింది. నిబంధనలకు అనుగుణంగా లేని భవనాల్లో కళాశాలలను ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఇప్పుడే నిద్ర లేచిందని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కళాశాలలపై తీసుకున్న చర్యలను వివరిస్తూ మూడు వారాల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేటు కళాశాలలపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ పలువురు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేŒన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కళాశాలలపై చర్యలు తీసుకున్నామని, 20 నారాయణ, 10 శ్రీచైతన్య కళాశాలలుసహా 40 ఇతర కళాశాలలను మూసివేశామని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. కాగా, చట్టం రాకముందు నిర్మించిన భవనాలకు కూడా అనుమతివ్వడం లేదని, ప్రభుత్వం అకస్మాత్తుగా నిబంధనలు అమలు చేయాలని చెబుతోందని, ప్రత్యామ్నాయ నిబంధనలు పరిశీలించాలని పలు కళాశాలల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కళాశాలల వాదన సహేతుకంగా లేదని, అగ్నిమాపక నిబంధనలను తప్పక పాటించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేస్తూ కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పును రిజర్వు చేసింది.
Published date : 26 Feb 2021 04:25PM