కాలేజీ ఫీజులు పెరగవు: జస్టిస్ ఈశ్వరయ్య స్పష్టీకరణ
Sakshi Education
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల పెంపు ఉండదని ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య స్పష్టం చేశారు.
గతంలో కన్నా తగ్గినా తగ్గవచ్చని అభిప్రాయపడ్డారు. జనవరి 29 (బుధవారం)నజరిగిన కమిషన్ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, కమిషన్ సభ్య కార్యదర్శి డాక్టర్ ఎన్.రాజశేఖరరెడ్డి. వైస్ చైర్మన్ ప్రొఫెసర్ భార్గవరామ్, సభ్యులు ప్రొఫెసర్ విజయ ప్రకాశ్, ప్రొఫెసర్ డి.ఉషారాణి (అకడమిక్) కె.విజయాలు రెడ్డి (ఫైనాన్‌స) తదితరులతో చర్చించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి కేవలం విద్యా సంబంధ అంశాలకు అయ్యే ఖర్చులను మాత్రమే పరిగణనలోకి తీసుకొని (గతంలో ఇతర ఖర్చులూ కలిపే వారు) ఫీజులు నిర్ణయిస్తున్నామని చెప్పారు. ఆయా కాలేజీలు అందించిన నివేదికలు, తమ బృందాల పరిశీలనలో వెల్లడైన అంశాల మధ్య వ్యత్యాసం ఉందని.. వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని ఫీజులు నిర్ణయిస్తామన్నారు. కమిషన్ తీసుకున్న నిర్ణయాలను ఆయన ఇలా వివరించారు.
ఇవీ కమిషన్ నిర్ణయాలు..
ఇవీ కమిషన్ నిర్ణయాలు..
- ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రమాణాలు, సౌకర్యాలు ఇతర విద్యా సంబంధ వసతులను దృష్టిలో పెట్టుకొని ఫీజులుంటాయి. ఏకరూప ఫీజులు ఉండవు. ఫీజులపై ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఆయా కాలేజీల వాదనలు వింటాం. ఫిబ్రవరి మధ్యలో ఫీజులు ప్రకటిస్తాం.
- మెడికల్, ఫార్మా కాలేజీల్లో కూడా కమిషన్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తాయి. వీటిలో ఫీజుల శ్లాబ్ విధానం ఎలా ఉండాలన్న దానిపై వచ్చే సమావేశంలో నిర్ణయం.
- యూజీ, పీజీ, డిగ్రీ కోర్సులు, లా కోర్సులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల ఫీజులను కూడా ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నిర్ణయిస్తుంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల.
- ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఆయా కాలేజీలు ఫీజుల నివేదికలను వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయాలి.
- ఈ ఏడాది ఫీజుల నిర్ణయం ఆలస్యమైంది. అందువల్ల 2020-21, 2022-23 విద్యా సంవత్సరాలకు ఈ ఫీజు నిర్ణయం ఉంటుంది.
- డిగ్రీ, పీజీ కోర్సులకు ఒకేరకమైన ఫీజుల అమలు.
- కన్వీనర్ కోటా లేదా మేనేజ్‌మెంటు కోటాలో కమిషన్ నిర్ణయించిన ఫీజు మాత్రమే వసూలు చేయాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవు. దీనిపై ఫిర్యాదుల కోసం త్వరలో టోల్‌ఫ్రీ నంబర్‌తో గ్రీవెన్‌స సెల్ ఏర్పాటు.
- ఏ కళాశాల అయినా విద్యార్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలను తీసుకోరాదు. కేవలం ఫొటోస్టాట్ కాపీలను సరిపోల్చుకోవడానికి తీసుకుని, పరిశీలించిన వెంటనే వెనక్కు ఇవ్వాలి. ఈ విషయమై విద్యార్థులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
- కనీస సదుపాయాలు కూడా లేని కాలేజీలకు కొంత సమయం ఇస్తాం. లోపాలు సరిదిద్దుకోకపోతే వాటిపై చర్యలకు సిఫార్సు చేస్తాం.
Published date : 30 Jan 2020 04:56PM