కాలేజీ లోపాలపై నివేదికలివ్వకుంటే అప్రూవల్ కష్టమే: జేఎన్‌టీయూ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పరిసరాల్లోని 111 జీవో పరిధిలో స్థల, అనుమతుల సమస్యలను ఎదుర్కొంటున్న కాలేజీలు లోపాల సవరణ నివేదికలను ఇవ్వకపోతే వాటికి అనుమతులు ఇవ్వడం కష్టమేనని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోవర్ధన్ పేర్కొన్నారు.
జేఎన్‌టీయూలో ఎంసెట్ కమిటీ సమావేశం సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఆయా కాలేజీలకు తాము ఇప్పటివరకు మూడుసార్లు నోటీసులు జారీ చేశామన్నారు. 111 జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో మొత్తంగా 154 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయని, అందులో 81 కాలేజీలు నివేదికలను ఇవ్వగా, మిగతా కాలేజీలు ఇవ్వలేదని పేర్కొన్నారు. దీనిపై తాము రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఆయా కాలేజీలతోపాటు మరికొన్ని కాలేజీల భవన అనుమతులకు సంబంధించిన అంశం ఏఐసీటీఈ పరిధిలో ఉందని, ఏఐసీటీఈ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మరోవైపు అనుబంధ గుర్తింపు ఇచ్చే సమయంలో ల్యాబ్‌లు, సదుపాయాలు, ఫ్యాకల్టీ తదితర అంశాలను పరిశీలిస్తామన్నారు. పీహెచ్‌డీల జెన్యూనిటీ విషయంలో తాము పరిశీలన జరుపుతున్నామని, అనేక లోపాలను గుర్తించామన్నారు. కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించామని, ఏఐసీటీఈ ఈనెల 29వ తేదీ వరకు గుర్తింపు కోసం గడువిచ్చినందున, తాము అనుబంధ గుర్తింపు గడువు మళ్లీ పొడగిస్తామన్నారు. ఇక రాష్ట్రంలో మొత్తంగా 15 కాలేజీలు కోర్సుల రద్దుకు దరఖాస్తు చేసుకున్నాయని, అందులో 7 పూర్తిగా కాలేజీలను మూసి వేసుకునేందుకే దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.
Published date : 17 Feb 2020 03:41PM