Skip to main content

జనవరి 9న జగనన్న అమ్మ ఒడి..

సాక్షి, అమరావతి: నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి జనవరి 9వ తేదీన ప్రారంభం కానుంది.
ఇందుకు సంబంధించి పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ సోమవారం జీఓ నంబర్ 63 జారీ చేశారు. రాష్ట్రంలో 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న పేద కుటుంబాల్లోని పిల్లల తల్లులు, సంరక్షకులకు ఈ పథకం కింద ఏటా రూ.15 వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ కారణంగా 2020-21లో పిల్లలను విద్యా సంస్థలకు పంపలేని పరిస్థితులు ఎదురైనందున ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరి అన్న నిబంధనను సడలిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

టాయిలెట్ నిర్వహణ ఫండ్ కోసం రూ.1000
ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల్లో టాయిలెట్ల నిర్వహణ నిధి (టీఎంఎఫ్) కోసం జగనన్న అమ్మ ఒడి కింద ఇచ్చే రూ.15 వేలల్లో రూ.1000 జిల్లాల్లో కలెక్టర్ల నియంత్రణలోని జిల్లా టాయిలెట్ల నిర్వహణ నిధి అకౌంట్లలో వేయనున్నారు. అక్కడి నుంచి అవసరం మేరకు ఆయా స్కూళ్లు, కాలేజీల కమిటీల అకౌంట్లకు జమ చేస్తారు. మిగతా రూ.14,000 అర్హులైన తల్లులు, సంరక్షకుల అకౌంట్లలో నేరుగా జమ చేయనున్నారు.

ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్ అడ్మిషన్లలో జాప్యం వల్ల 2019-20లో పదో తరగతి పాసై 2020-21 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్‌లో చేరాల్సిన అర్హులైన విద్యార్థుల తల్లులు, సంరక్షకులకు ఈ పథకాన్ని వర్తింప చేయనున్నారు. అయితే ఈ విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరంలో ఐటీఐ, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీలలో చేరితే వారికి జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను మినహాయిస్తారు.
Published date : 29 Dec 2020 01:14PM

Photo Stories